LOADING...
IPL 2026 : రూ.3 కోట్ల ప్లేయర్‌.. ఇప్పుడు రూ.30 కోట్ల ఆట.. డెబ్యూ సీజన్‌లోనే సంచలనం
రూ.3 కోట్ల ప్లేయర్‌.. ఇప్పుడు రూ.30 కోట్ల ఆట.. డెబ్యూ సీజన్‌లోనే సంచలనం

IPL 2026 : రూ.3 కోట్ల ప్లేయర్‌.. ఇప్పుడు రూ.30 కోట్ల ఆట.. డెబ్యూ సీజన్‌లోనే సంచలనం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 18, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతున్నా ఆ జట్టుకు దొరికిన ఒక ప్లేయర్ మాత్రం రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా యువ హిట్టర్ కూపర్ కోనోలీ ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో అరంగేట్రం సీజన్‌లోనే తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఐపీఎల్ ఆడుతున్న మొదటి సీజన్‌లోనే అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా కోనోలీ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య 19 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును కోనోలీ కనుమరుగు చేశాడు. 2008లో జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన సనత్ జయసూర్య 31 సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు.

వివరాలు

32 సిక్సర్లు బాదిన ప్లేయర్

దాదాపు రెండు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును కూపర్ కోనోలీ ఇప్పుడు తన 32వ సిక్సర్‌తో బద్దలు కొట్టాడు. కేవలం 3 కోట్ల రూపాయల ధరకే పంజాబ్ దక్కించుకున్న ఈ ఆసీస్ ఆటగాడు, పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేస్తూ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ జాబితాలో జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (28 సిక్సర్లు), ఫిన్ అలెన్ (27 సిక్సర్లు) వంటి పవర్ హిట్టర్లు కోనోలీ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్‌లో కూపర్ కోనోలీ ప్రదర్శన చూస్తుంటే దిగ్గజ బ్యాటర్లే విస్తుపోతున్నారు. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 47.30 సగటుతో 473 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 162.54గా ఉండటం విశేషం.

వివరాలు

సన్నగిల్లిన ఫ్లేఆఫ్ అవకాశాలు

ఈ సీజన్‌లో ఇప్పటికే ఒక సెంచరీ (107 నాటౌట్), రెండు హాఫ్ సెంచరీలు బాదిన కోనోలీ, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్‌లో కోనోలీ ఇప్పుడు ఒక నమ్మదగ్గ ఫినిషర్‌గా ఎదిగాడు. కోనోలీ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, పంజాబ్ కింగ్స్ జట్టు పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం 13 మ్యాచుల్లో 6 విజయాలతో 13 పాయింట్లు ఉన్న పంజాబ్, తన చివరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. గెలిచినా కూడా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement