Rome diamond league: క్రికెట్‌కు వీడ్కోలు.. జావెలిన్‌లో విశ్వరూపం! 92.62 మీటర్ల త్రోతో రుమేష్ సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు క్రికెట్ పిచ్‌పై గంటకు 134 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించిన లంక ఫాస్ట్ బౌలర్.. ఇప్పుడు అథ్లెటిక్స్ ట్రాక్ పై ఈటెను రాకెట్ వేగంతో విసురుతూ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇటలీ రాజధాని రోమ్‌లోని ప్రతిష్ఠాత్మక స్టాడియో ఒలింపికో వేదికగా జరిగిన 'రోమ్ డైమండ్ లీగ్ 2026'లో శ్రీలంకకు చెందిన 23 ఏళ్ల జావెలిన్ త్రోయర్ రుమేష్ తరంగ పతిరాగే సంచలన ప్రదర్శన చేశాడు. గురువారం రాత్రి జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో 92.62 మీటర్ల దూరం ఈటెను విసిరి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2026 సీజన్‌లో ప్రపంచంలోనే అత్యంత సుదూర మార్కును తాకిన మొదటి అథ్లెట్‌గా రుమేష్ రికార్డు సృష్టించాడు.
వివరాలు
రెండో ప్రయత్నంలోనే అద్భుత రికార్డు..
రెండో ప్రయత్నంలోనే రుమేష్ ఈ అసాధారణ మైలురాయిని చేరుకున్నాడు. అతని కంటే దాదాపు 10 మీటర్ల వెనుకబడిన మాజీ ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనడా-83.91 మీ) రజతం గెలవగా, అమెరికాకు చెందిన కర్టిస్ థాంప్సన్ కాంస్యం దక్కించుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో నార్వే దిగ్గజం ఆండ్రియాస్ థోర్కిల్డ్‌సెన్ పేరిట 2006 నుంచి ఉన్న 20 ఏళ్ల నాటి రోమ్ మీట్ రికార్డును (90.34 మీ) రుమేష్ ఏకంగా రెండు మీటర్ల తేడాతో బద్దలు కొట్టాడు. ఇది సరికొత్త శ్రీలంక జాతీయ రికార్డు కావడం విశేషం.
వివరాలు
ఆసియా జావెలిన్ చరిత్రలో సరికొత్త సంచలనం..
ఈ అద్భుత విజయంతో ప్రపంచ జావెలిన్ హిస్టరీలో 90 మీటర్ల మార్కును దాటిన ఎలైట్ క్లబ్‌లో రుమేష్ చేరిపోయాడు. ఆసియా ఖండం నుంచి ఈ ఘనత సాధించిన కేవలం నాలుగో అథ్లెట్‌గా నిలిచాడు. ఇంతకుముందు భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా (90.23 మీ), పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ (92.97 మీ), చైనీస్ తైపీకి చెందిన చెంగ్ చావో-సున్ (91.36 మీ)లు మాత్రమే ఈ మైలురాయిని దాటారు. ఇప్పుడు రుమేష్ ఏకంగా 92.62 మీటర్లు విసిరి, భారతదేశ స్టార్ నీరజ్ చోప్రా కెరీర్ బెస్ట్ రికార్డును అధిగమించాడు. అంతేకాదు, పారిస్ ఒలింపిక్స్‌లో పాక్ స్టార్ అర్షద్ నదీమ్ నెలకొల్పిన ఆసియా రికార్డుకు (92.97 మీ) కేవలం 35 సెంటీమీటర్ల దూరంలో రుమేష్ నిలిచాడు.
వివరాలు
క్రికెట్ డ్రాపౌట్ టు హిస్టరీ మేకర్..
లంకలోని కలుతర ప్రాంతానికి చెందిన రుమేష్ చిన్నతనంలో క్రికెట్‌ను అమితంగా ప్రేమించాడు. సెయింట్ పీటర్స్ కాలేజీ తరఫున ఆడుతూ ఒకే మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి.. హాఫ్ సెంచరీ చేసిన రికార్డు కూడా ఉంది. అయితే క్రికెట్‌లో ఉండే విపరీతమైన పోటీ, రాజకీయాల కారణంగా 2017లో తన తండ్రి (మాజీ డిస్కస్ త్రో అథ్లెట్) ప్రోత్సాహంతో జావెలిన్ వైపు అడుగులు వేశాడు. గత ఏడాది టోక్యో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 6వ స్థానంలో నిలిచిన అతడు, ఈ ఏడాది మార్చిలోనే 89.37 మీటర్లతో ఫామ్‌లోకి వచ్చాడు. నీరజ్ చోప్రాను తన రోల్ మోడల్‌గా భావించే రుమేష్, రాబోయే ఆసియా క్రీడల్లో నీరజ్, అర్షద్ నదీమ్‌లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.