Wimbledon 2026: వింబుల్డన్‌లో క్రికెట్ స్టార్ల సందడి.. ఫెదరర్‌తో సచిన్ భేటీ.. గిల్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రఖ్యాత వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ ఈసారి క్రీడా ప్రముఖుల సందడితో మరింత ఆకర్షణీయంగా మారింది. టెన్నిస్ దిగ్గజాలతో పాటు వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులు కూడా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రాయల్ బాక్స్‌లో కూర్చొని మ్యాచ్‌ను ఆస్వాదించారు. టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్‌ను సచిన్ కలుసుకోవడం ఆకర్షణగా నిలిచింది. ఈ అరుదైన క్షణానికి సంబంధించిన చిత్రాన్ని వింబుల్డన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ.. "రెండు క్రీడలు.. ఇద్దరు దిగ్గజాలు" అంటూ క్యాప్షన్ జత చేసింది.
వివరాలు
సచిన్ పక్కనే గిల్..
ఈ పోస్టుపై సచిన్ కూడా స్పందించారు. "కొన్ని ర్యాలీలు ఎప్పటికీ ముగియవు. మన స్నేహం కూడా అలాంటిదే. రోజర్.. నీతో మళ్లీ సమయం గడపడం ఎంతో ఆనందంగా ఉంది. త్వరలో మరోసారి కలుద్దాం" అంటూ ఆయన సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఇక వింబుల్డన్-2026 మ్యాచ్‌ను వీక్షించేందుకు సచిన్ తన భార్య అంజలి టెండూల్కర్‌తో కలిసి రాయల్ బాక్స్‌కు వచ్చారు. వారితో పాటు భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా హాజరయ్యాడు. దీంతో భారత జట్టు కెప్టెన్ హోదాలో వింబుల్డన్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన నాలుగో భారత క్రికెటర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు.
వివరాలు
నెట్టింట పోస్టులు వైరల్..
అయితే, సచిన్-అంజలి దంపతుల పక్కనే శుభ్‌మన్ గిల్ కూర్చోవడం సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది. సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌తో గిల్ ప్రేమలో ఉన్నాడనే ప్రచారానికి ఈ దృశ్యం మరింత బలం చేకూర్చిందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. మరోవైపు, 2015లో కూడా సచిన్, అంజలి దంపతులతో కలిసి విరాట్ కోహ్లీ వింబుల్డన్ మ్యాచ్‌ను వీక్షించిన విషయం గుర్తు చేస్తూ అభిమానులు పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. అప్పట్లో "కింగ్" సచిన్ పక్కన కనిపించాడని, ఇప్పుడు "ప్రిన్స్" శుభ్‌మన్ గిల్ కనిపిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో సరదా పోస్టులు వైరల్ అవుతున్నాయి.