
Sunil Gavaskar: అదేం లాజిక్.. పాక్‌పై ఐసీసీ చర్యలు తప్పనిసరి : సునీల్ గావస్కర్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు ప్రవర్తనపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మ్యాచులకు ఆలస్యంగా రావడం, తప్పనిసరిగా హాజరుకావాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లను నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు భారత ఆటగాళ్లు తమతో 'కరచాలనం' చేయలేదని, రిఫరీ మార్పు అవసరమని వంటి విషయాలపై పీసీబీ వరుసగా ఫిర్యాదులు చేస్తూనే ఉందని, కానీ ఐసీసీ, ఏసీసీ వాటిని పట్టించుకోలేదని గావస్కర్ పేర్కొన్నారు. అయినప్పటికీ పీసీబీ అదే విషయాలను పట్టుకుని ఐసీసీకి వరుసగా మెయిల్స్ పంపడాన్ని ఆయన తీవ్రంగా ఎద్దేవా చేశారు. 'కరచాలనం చేయాలని ఎక్కడా రూల్‌బుక్‌లో లేదు. అయినా సరే పదేపదే అదే విషయంపై ఫిర్యాదులు చేస్తున్నారు.
Details
జట్టు తరుపున ఎవరో ఒకరు హాజరు కావాలి
ఇతర క్రీడల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ ఏ లాజిక్ ప్రకారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఐసీసీ పట్టించుకోకుండా ఉండడం సరికొత్త నిర్ణయం. కానీ మ్యాచ్‌ల సమయంలో మీడియా సమావేశాలకు జట్టు తరఫున తప్పనిసరిగా ఎవరో ఒకరు హాజరుకావాలి. అయితే పాక్ జట్టు మాత్రం కెప్టెన్, ఆటగాళ్లు, కనీసం కోచ్‌ను కూడా పంపలేదు. ఇక్కడ అసలు సమస్య ఇదే. చేయాల్సిన బాధ్యతలను పక్కన పెట్టిందని గావస్కర్ వ్యాఖ్యానించారు. అలాగే పాక్ యూఏఈతో మ్యాచ్‌కు కూడా బాయ్‌కాట్ నినాదంతో ఆలస్యంగా వచ్చిందని ఆయన గుర్తు చేశారు.
Details
ఐసీసీ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి
ఈ విషయంలోనూ ఐసీసీ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మ్యాచ్ రిఫరీ తమకు క్షమాపణలు చెప్పారంటూ పాకిస్థాన్ కట్టుకథలు అల్లిందని, కానీ ఐసీసీ అటువంటి ఘటన ఏదీ జరగలేదని స్పష్టంచేసిందని గావస్కర్ తెలిపారు. ప్రతి విషయంలోనూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రవర్తన సరైనదిగా లేదని ఆయన ఘాటుగా విమర్శించారు.