IND vs NZ: నేడు రెండో టీ20.. కుల్దీప్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టు.. ఆ తర్వాతి రెండు వన్డేల్లో పరాజయం పాలై సిరీస్‌ను చేజార్చుకుంది. టీ20సిరీస్‌లో మాత్రం సూర్యకుమార్ యాదవ్ సేన శుభారంభం చేసింది. తొలి టీ20లో సమష్టిగా రాణించిన భారత్.. కివీస్‌ను పూర్తిగా కట్టడి చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే జోరును కొనసాగించగలదా అన్నది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం జరగనున్న రెండో టీ20కు రాయ్‌పుర్ వేదికగా నిలవనుంది. తొలి టీ20లో విజయం సాధించినప్పటికీ భారత జట్టు ఆటలో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపించాయి. త్వరలోనే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ లోపాలను సరిదిద్దుకోవడం భారత జట్టుకు అత్యవసరం. ముఖ్యంగా టాప్‌ఆర్డర్‌లో సంజు శాంసన్, ఇషాన్ కిషన్ నిరాశపరిచారు.
Details
నిరాశ పరుస్తున్న సంజుశాంసన్
పేలవమైన షాట్ సెలక్షన్‌తో ఇద్దరూ చాలా తేలిగ్గా వికెట్లు కోల్పోయారు. అవకాశాలు వరుసగా లభిస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్న సంజు శాంసన్ మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. మరోవైపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగొచ్చిన ఇషాన్ కిషన్ కూడా పట్టుదలతో ఆడలేకపోయాడు. రెండో టీ20లో శాంసన్, కిషన్ ఫామ్‌లోకి రావడం భారత్‌కు కీలకంగా మారింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలి మ్యాచ్‌లో 22 బంతుల్లో 32 పరుగులతో కాస్త మెరుగ్గా కనిపించినప్పటికీ.. భారీ స్కోరు చేయలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో అతడు పూర్తి స్థాయిలో చెలరేగాలని జట్టు ఆశిస్తోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసక బ్యాటింగ్, చివరి ఓవర్లలో రింకు సింగ్ మెరుపు ఇన్నింగ్స్ మాత్రం భారత్‌కు ప్రధాన సానుకూలాంశాలుగా నిలిచాయి.
Details
కుల్‌దీప్‌కు అవకాశం?
తొలి టీ20లో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌కు రెండో టీ20లో తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. తొలి మ్యాచ్‌లో వేలికి గాయం కావడంతో అక్షర్ పటేల్ తన బౌలింగ్ కోటాను పూర్తిచేయలేకపోయాడు. ఈ మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. అక్షర్ ఆడకపోతే వరుణ్ చక్రవర్తితో కలిసి కుల్‌దీప్ స్పిన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. పవర్‌ప్లేలో అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్య వికెట్లు తీస్తుండటంతో మిడిల్ ఓవర్లలో జస్ప్రీత్ బుమ్రాను ఉపయోగించే వ్యూహం భారత్‌కు కలిసి వస్తోంది. రెండో టీ20లోనూ ఇదే ప్రణాళికతో టీమ్‌ఇండియా బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది.
Details
కివీస్‌ను తక్కువగా అంచనా వేయలేం
తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ న్యూజిలాండ్ పోరాటంలో ఏమాత్రం తగ్గలేదు. కివీస్‌ను తక్కువగా అంచనా వేస్తే సూర్య సేనకు చేదు అనుభవం తప్పదని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కసితో బరిలో దిగనున్న న్యూజిలాండ్‌ను ఆపాలంటే భారత్ మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ నుంచే భారత్‌కు ప్రధాన ప్రమాదం పొంచి ఉంది. వీరిద్దరినీ వీలైనంత త్వరగా పెవిలియన్‌కు చేర్చడం అత్యంత కీలకం. తొలి మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించని ఓపెనర్ డెవోన్ కాన్వే కూడా ప్రమాదకర ఆటగాడేనని భారత బౌలర్లు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో కివీస్‌కు కళ్లెం వేయగలిగితేనే రెండో టీ20లో భారత్ ఆధిక్యం కొనసాగించే అవకాశం ఉంటుంది.
Details
ఇరు జట్లలోని ప్లేయర్స్ వీరే!
భారత జట్టు సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శాంసన్, ఇషాన్ కిషన్/శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, కుల్‌దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్, అర్ష్‌దీప్. న్యూజిలాండ్ జట్టు శాంట్నర్ (కెప్టెన్), కాన్వే, మిచెల్, ఫిలిప్స్, రాబిన్సన్, సోధి, చాప్‌మన్, రచిన్ రవీంద్ర, జేమీసన్, డఫీ, హెన్రీ