Loading...
Vedant Sehwag: సెహ్వాగ్ కొడుకు సూపర్ బౌలింగ్.. ఒకే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు!
సెహ్వాగ్ కొడుకు సూపర్ బౌలింగ్.. ఒకే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు!

Vedant Sehwag: సెహ్వాగ్ కొడుకు సూపర్ బౌలింగ్.. ఒకే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2026
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు వేదాంత్ సెహ్వాగ్ అండర్-19క్రికెట్‌లో అదరగొట్టాడు. కూచ్ బెహార్ ట్రోఫీ ఎలైట్ టోర్నీలో ఢిల్లీ అండర్-19జట్టు తరఫున బరిలోకి దిగిన అతడు.. పంజాబ్‌పై ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కూచ్ బెహార్ ట్రోఫీ ఎలైట్ టోర్నీలో ఢిల్లీ అండర్-19, పంజాబ్ అండర్-19జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో వేదాంత్ సెహ్వాగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు తీసి ఢిల్లీ జట్టుకు పైచేయి అందించాడు. వేదాంత్ మొత్తం 22.3 ఓవర్లు బౌలింగ్ చేసి 88 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు.

వివరాలు

పంజాబ్‌పై ఏడు వికెట్లతో చెలరేగిన వేదాంత్

ఇందులో ఐదు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. 3.91 ఎకానమీతో బౌలింగ్ చేసి పంజాబ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు.

ఢిల్లీ బౌలర్లలో నకుల్ యాదవ్ 25 పరుగులకు ఒక వికెట్ తీశాడు. రాహుల్ రాకేష్ యాదవ్, అర్నవ్ బుగ్గా కూడా చెరో వికెట్ సాధించారు.

దీంతో పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ బ్యాటర్లలో సహిజ్‌బోత్‌వీర్ సింగ్ 116బంతుల్లో 61 పరుగులు చేయగా.. నూర్‌వీర్ సింగ్ 58 బంతుల్లో 58 పరుగులతో రాణించాడు. ఆర్యవీర్ సెహ్వాగ్ 94 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 104పరుగులు చేసింది.

వివరాలు

తండ్రి బాటలోనే సెహ్వాగ్ తనయులు

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. దూకుడైన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

తన టెస్టు కెరీర్‌లో 104 మ్యాచ్‌లు ఆడి 8,586 పరుగులు సాధించాడు. అలాగే 251 వన్డేల్లో 8,273 పరుగులు చేశాడు.

ఇప్పుడు అతని కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్ కూడా క్రికెట్‌లో తమ ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే ఆర్యవీర్ అండర్-19 క్రికెట్‌లో తన ఆటతో గుర్తింపు తెచ్చుకోగా.. తాజాగా వేదాంత్ ఏడు వికెట్ల ప్రదర్శనతో వార్తల్లో నిలిచాడు.

ADVERTISEMENT