LOADING...
Rajasthan Royals: ఆర్ఆర్‌లో సంచలన నిర్ణయాలు.. హోమ్‌ గ్రౌండ్‌ మార్పుతో పాటు కెప్టెన్‌ మార్పు 
ఆర్ఆర్‌లో సంచలన నిర్ణయాలు.. హోమ్‌ గ్రౌండ్‌ మార్పుతో పాటు కెప్టెన్‌ మార్పు

Rajasthan Royals: ఆర్ఆర్‌లో సంచలన నిర్ణయాలు.. హోమ్‌ గ్రౌండ్‌ మార్పుతో పాటు కెప్టెన్‌ మార్పు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2026
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2026 సీజన్‌కు ముందే రాజస్థాన్‌ రాయల్స్‌ (RR) జట్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమ సొంత హోమ్‌ గ్రౌండ్‌ అయిన జైపూర్‌ను పక్కనపెట్టి, కొన్ని హోమ్‌ మ్యాచ్‌లను పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) స్టేడియంలో నిర్వహించేందుకు ఫ్రాంచైజీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఐఏఎన్ఎస్‌ తన కథనంలో వెల్లడించింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (ఆర్‌సీఏ)తో ఉన్న విభేదాలేనని సమాచారం. గత ఐపీఎల్‌ 2025 సీజన్‌ సమయంలో ఓ ఆర్‌సీఏ అధికారి రాజస్థాన్‌ రాయల్స్‌పై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఆ ఆరోపణలను ఫ్రాంచైజీ కఠినంగా ఖండించింది.

Details

పుణెలోని ఎంసీఏ స్టేడియం సందర్శన

ప్రస్తుతం ఆర్‌సీఏను తాత్కాలిక కమిటీ నిర్వహిస్తుండటంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారిందని, ఇదీ మైదానం మార్పు ఆలోచనకు మరో కారణంగా భావిస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రతినిధులు పుణెలోని ఎంసీఏ స్టేడియాన్ని సందర్శించి, అక్కడి మౌలిక వసతులను పరిశీలించినట్టు సమాచారం. ఈ ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని, త్వరలోనే బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, రాజస్థాన్‌ రాయల్స్‌కు ఇప్పటికే గువాహటిలోని బర్సపరా స్టేడియం రెండో హోమ్‌ గ్రౌండ్‌గా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు మైదానం మార్పుతో పాటు జట్టు కెప్టెన్సీపై కూడా అంతర్గతంగా చర్చలు సాగుతున్నాయి.

Details

కెప్టెన్సీ రేసులో రవీంద్ర జడేజా

సంజూ శాంసన్‌ తర్వాతి కెప్టెన్‌గా రవీంద్ర జడేజా పేరు బలంగా వినిపిస్తోంది. ఇటీవల చెన్నై సూపర్‌ కింగ్స్‌ నుంచి ట్రేడ్‌ ద్వారా రాజస్థాన్‌ రాయల్స్‌లో చేరిన జడేజా, గతంలో 2008-09 సీజన్లలోనూ ఈ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. అదే సమయంలో యశస్వి జైస్వాల్‌, రియాన్‌ పరాగ్‌ పేర్లు కూడా కెప్టెన్సీ రేసులో పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. పుణెలోని ఎంసీఏ స్టేడియం గతంలో పుణె వారియర్స్‌ ఇండియా, రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ వంటి ఐపీఎల్‌ జట్లకు హోమ్‌ గ్రౌండ్‌గా సేవలందించిన అనుభవం కలిగి ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ రాయల్స్‌ తీసుకుంటున్న నిర్ణయం ఐపీఎల్‌ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

Advertisement