Rishabh Pant: స్వాప్ డీల్ సంచలనం.. మళ్లీ దిల్లీ క్యాపిటల్స్ గూటికి రిషభ్ పంత్!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్‌లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ తిరిగి దిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీల మధ్య జరిగిన స్వాప్ డీల్‌లో భాగంగా పంత్ దిల్లీకి మారగా, భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ లఖ్‌నవూ జట్టులోకి వెళ్లాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నిరాశాజనక ప్రదర్శన చేసింది. మొత్తం 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ వైఫల్యాల నేపథ్యంలో ఇటీవల రిషభ్ పంత్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు స్వాప్ డీల్ ద్వారా జట్టును కూడా వీడాడు.
వివరాలు
రూ.15 కోట్లు చెల్లించిన దిల్లీ క్యాపిటల్స్
ఈ ఒప్పందంలో భాగంగా పంత్ తన జీతంలో భారీ కోతకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్ అతడికి రూ.15 కోట్ల వేతనం చెల్లించనుంది. మరోవైపు కుల్‌దీప్ యాదవ్ మాత్రం తన ప్రస్తుత వేతనమైన రూ.13.50 కోట్లను కొనసాగించనున్నాడు. ఈ ట్రేడ్ డీల్‌ను ఇరు ఫ్రాంచైజీలు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధికారికంగా ప్రకటించాయి. గతంలో 2025 ఐపీఎల్ మెగా వేలంలో రిషభ్ పంత్‌ను లఖ్‌నవూ ఫ్రాంచైజీ రికార్డు స్థాయిలో రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం అతడిని జట్టు కెప్టెన్‌గా నియమించింది. అయితే పంత్ నాయకత్వంలో లఖ్‌నవూ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. రెండు సీజన్‌లలో అతడి సారథ్యంలో జట్టు మొత్తం కేవలం 10 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించడం గమనార్హం.
వివరాలు
అశించిన స్థాయిలో రాణించని పంత్
ప్రత్యేకంగా 2025 సీజన్‌లో లఖ్‌నవూ ఆరు విజయాలు సాధించినప్పటికీ ప్లేఆఫ్స్‌కు అర్హత పొందలేకపోయింది. వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 269 పరుగులు మాత్రమే చేసిన అతడు, ఈ ఏడాది 312 పరుగులు నమోదు చేశాడు. అయినప్పటికీ అతడి బ్యాటింగ్ ప్రదర్శన అభిమానులు, జట్టు యాజమాన్యాన్ని పూర్తిగా సంతృప్తిపరచలేకపోయింది. ఈ నేపథ్యంలో జరిగిన స్వాప్ డీల్ ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వచ్చిన పంత్ తన పాత జట్టుతో కొత్త ఆరంభం చేయాలని భావిస్తుండగా, లఖ్‌నవూ కుల్‌దీప్ యాదవ్ రూపంలో కీలక స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకుంది.