Loading...
Shefali Verma: పాక్‌పై 12 పరుగులే.. రెండు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన షెఫాలీ
పాక్‌పై 12 పరుగులే.. రెండు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన షెఫాలీ

Shefali Verma: పాక్‌పై 12 పరుగులే.. రెండు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన షెఫాలీ

వ్రాసిన వారు Moogati Shabari
Sep 06, 2026
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ఆసియా కప్ 2026లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ కేవలం 12 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ స్వల్ప ఇన్నింగ్స్‌తోనే ఆమె ప్రపంచ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది. ఏకంగా రెండు ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ప్రారంభంలో 7 పరుగులు చేయగానే షెఫాలీ వర్మ అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో 3,000 పరుగుల మైలురాయిని చేరుకుంది. కేవలం 22 సంవత్సరాల 220 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించి.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లో 3,000 పరుగులు పూర్తి చేసిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది.

వివరాలు

పురుషుల క్రికెట్‌లోనూ ఎవరికీ సాధ్యం కాని రికార్డు..

గతంలో ఐర్లాండ్‌కు చెందిన గాబీ లూయిస్ 24 సంవత్సరాల 247 రోజుల వయసులో ఈ రికార్డు సాధించింది.

ఆమె రికార్డును షెఫాలీ బద్దలు కొట్టింది. ఈ జాబితాలో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 27 సంవత్సరాల 171 రోజుల వయసులో ఈ మైలురాయిని చేరుకుని తర్వాతి స్థానంలో ఉంది.

పురుషుల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కూడా ఇంత చిన్న వయసులో 3,000 పరుగుల మైలురాయిని ఏ ఆటగాడూ చేరుకోలేకపోయాడు.

మలేషియాకు చెందిన వీరన్‌దీప్ సింగ్ 26 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించగా.. ఫుల్ మెంబర్ దేశాల ఆటగాళ్లలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ 28 ఏళ్ల వయసులో 3,000 పరుగులు పూర్తి చేశాడు.

వివరాలు

బంతుల పరంగా కూడా ప్రపంచ రికార్డు..

వీరందరి కంటే తక్కువ వయసులోనే షెఫాలీ ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం.

వయసు పరంగానే కాకుండా.. 3,000 పరుగులు పూర్తి చేయడానికి ఎదుర్కొన్న బంతుల సంఖ్య పరంగా కూడా షెఫాలీ వర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

అంతర్జాతీయ టీ20ల్లో కేవలం 2,321 బంతుల్లోనే 3,000 పరుగులు పూర్తి చేసి.. ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన మహిళా క్రికెటర్‌గా నిలిచింది.

ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ అలిస్సా హేలీ పేరిట ఉన్న రికార్డును షెఫాలీ అధిగమించింది.

తన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే షెఫాలీ.. అంతర్జాతీయ టీ20ల్లో 3,000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకుని మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

ADVERTISEMENT

వివరాలు

మంధాన, హర్మన్‌ప్రీత్‌ల తర్వాత షెఫాలీ..

భారత మహిళల క్రికెట్‌లో స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో 3,000 పరుగులు పూర్తి చేసిన మూడో భారత క్రికెటర్‌గా షెఫాలీ వర్మ నిలిచింది.

అయితే ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే.. మంధాన, హర్మన్‌ప్రీత్‌ల కంటే వేగంగా ఆమె ఈ మైలురాయిని చేరుకుంది.

షెఫాలీ కేవలం 113 ఇన్నింగ్స్‌ల్లోనే 3,000 పరుగులు పూర్తి చేయగా.. స్మృతి మంధాన 122 ఇన్నింగ్స్‌లు, హర్మన్‌ప్రీత్ కౌర్ 135 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు.

ఇక ఓవరాల్‌గా అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ 100 ఇన్నింగ్స్‌లతో అగ్రస్థానంలో ఉంది.

ADVERTISEMENT