Hockey World Cup: హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు షాక్.. అర్జెంటీనా చేతిలో ఓడి సెమీస్‌కు దూరం!
ఈ వార్తాకథనం ఏంటి
హకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పతకానికి ఈసారీ కూడా దూరమైంది. పతకంపై భారీ అంచనాలతో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్..సెమీఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. సెమీస్ రేసులో నిలవాలంటే కనీసం మూడు గోల్స్ తేడాతో గెలవాల్సిన కీలక పూల్-ఇ మ్యాచ్‌లో సోమవారం అర్జెంటీనా చేతిలో భారత్ 3-5తో ఓటమిపాలైంది. టోర్నీ రెండో దశలో భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం చవిచూసి సెమీస్ రేసు నుంచి వైదొలిగింది. అర్జెంటీనా ఆరు పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోగా.. అన్ని పాయింట్లతో నెదర్లాండ్స్ ఇప్పటికే ముందంజలో ఉంది. ఇంగ్లాండ్ మూడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక భారత్ 5-6 స్థానాల వర్గీకరణ మ్యాచ్ ఆడనుంది.
వివరాలు
ఆరంభంలోనే ఎదురుదెబ్బలు
అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో తొలి నిమిషం నుంచే భారత్ వెనుకబడింది. మ్యాచ్ ప్రారంభమైన వెంటనే అర్జెంటీనా గోల్ సాధించింది.
గోల్‌కు ఎడమ వైపు నుంచి దూసుకొచ్చిన టాస్కని.. భారత గోల్‌కీపర్ మోహిత్‌ను బోల్తా కొట్టించి బంతిని నెట్‌లోకి పంపాడు.
ఆరు నిమిషాలకే భారత్‌కు మరో షాక్ తగిలింది. నికోలాస్ డెలా పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి అర్జెంటీనా ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.
అయితే 10వ నిమిషంలో సుఖ్‌జీత్ సింగ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో భారత్ ఖాతా తెరిచాడు.
వివరాలు
అర్జెంటీనా దూకుడు.. భారత్ డిఫెన్స్ ఉక్కిరిబిక్కిరి
రెండో క్వార్టర్‌లోనూ అర్జెంటీనా దాడులు కొనసాగాయి. అయితే భారత డిఫెండర్లు ప్రత్యర్థి ప్రయత్నాలను అడ్డుకున్నారు.
మూడో క్వార్టర్‌లోనూ బంతి ఎక్కువగా అర్జెంటీనా ఆధీనంలోనే కనిపించింది. హర్మన్‌ప్రీత్ బృందం ప్రత్యర్థి దాడులను అడ్డుకోవడానికే పరిమితమైంది.
ఎదురుదాడులు చేసే అవకాశాలు భారత్‌కు దాదాపుగా లభించలేదు. భారత్ కష్టాలను మరింత పెంచుతూ థామస్ 33, 45వ నిమిషాల్లో గోల్స్ సాధించాడు.
దీంతో అర్జెంటీనా 4-1తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్‌లో భారత్‌కు వరుసగా నాలుగు పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది.
వివరాలు
చివర్లో రెండు గోల్స్.. గౌరవప్రద ఓటమి
ఆ తర్వాత 53వ నిమిషంలో లుకాస్ మరో గోల్ చేయడంతో అర్జెంటీనా ఆధిక్యం 5-1కు చేరింది. దీంతో భారత్‌కు ఘోర పరాజయం తప్పదనిపించింది.
అయితే మ్యాచ్ ముగియడానికి రెండు నిమిషాల ముందు సుఖ్‌జీత్ 58వ నిమిషంలో గోల్ చేయగా.. 60వ నిమిషంలో హార్దిక్ మరో గోల్ సాధించాడు.
భారత్ చివరి గోల్ పెనాల్టీ స్ట్రోక్ ద్వారా వచ్చింది. దీంతో స్కోరు 3-5గా ముగిసి భారత్ కాస్త గౌరవప్రదంగా ఓటమిని చవిచూసింది.
వివరాలు
ఈ తప్పిదాలే కొంపముంచాయి
కీలక మ్యాచ్‌లో పెనాల్టీ కార్నర్లను సరైన రీతిలో సద్వినియోగం చేసుకోలేకపోవడం భారత్ కొంపముంచింది.
దీనికి తోడు పాసింగ్‌లో గందరగోళం, ఫినిషింగ్ లోపం, బలహీనమైన ఎటాకింగ్ కూడా జట్టు ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఫలితంగా పతక ఆశలతో ప్రపంచకప్ బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ బృందం.. సెమీఫైనల్ చేరకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.