FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో షాకింగ్ ఘటన.. జర్మనీ ఫుట్‌బాల్ జట్టు క్యాంప్‌లో విష సర్పం
ఈ వార్తాకథనం ఏంటి
ఫిఫా ప్రపంచకప్‌లో జర్మనీ జట్టును ప్రత్యర్థి జట్లు కాదు.. ఓ విషపూరిత పాము భయపెట్టింది. టోర్నీ కోసం జర్మనీ జట్టు అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని విన్‌స్టన్-సేలంలో తమ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే, క్యాంప్ పరిసరాల్లో గడ్డి కింద ఓ పాము సంచరిస్తున్నట్లు సిబ్బంది గుర్తించడంతో ఆటగాళ్లలో ఆందోళన నెలకొంది. జర్మనీ జట్టుకు మాత్రమే కాకుండా స్విట్జర్లాండ్, నార్వే జట్ల ఆటగాళ్లకూ పాములు కనిపించినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆయా జట్ల సభ్యులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై జర్మనీ కెప్టెన్ జాషువా కిమ్మిచ్ స్పందించాడు.
వివరాలు
ఎలాంటి ప్రమాదమూ జరగలేదు
"జర్మనీలో అయితే వ్యూహాలు, గాయాలు లేదా తదుపరి ప్రత్యర్థి గురించే ఆలోచిస్తాం. కానీ ఇక్కడ మాత్రం గడ్డిలో ఏముందో అనే విషయంపైనా ఆందోళన చెందాల్సి వస్తోందని ఆయన వ్యాఖ్యానించాడు. కిమ్మిచ్‌తో పాటు అతని సహచరులు చూసిన పాము కాపర్‌హెడ్ (Copperhead) జాతికి చెందినదిగా ఓ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ పాము నార్త్ కరోలినా ప్రాంతంలో సాధారణంగా కనిపించే విషపూరిత సర్పాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆటగాళ్లు లేదా సిబ్బందికి హాని కలగలేదని ఫిఫా వర్గాలు స్పష్టం చేశాయి.