LOADING...
Womens World Cup: మహిళల ప్రపంచకప్‌ షాకింగ్ ఘటన.. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను వేధించిన వ్యక్తి అరెస్ట్‌ 
మహిళల ప్రపంచకప్‌ షాకింగ్ ఘటన.. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను వేధించిన వ్యక్తి అరెస్ట్

Womens World Cup: మహిళల ప్రపంచకప్‌ షాకింగ్ ఘటన.. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను వేధించిన వ్యక్తి అరెస్ట్‌ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 25, 2025
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్ కోసం ఇండోర్‌కి వచ్చిన ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపుతోంది. గురువారం ఉదయం ఖజ్రానా రోడ్ వద్ద మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఒక వ్యక్తి, ఆస్ట్రేలియా జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లను వేధించడంతో పాటు వారిలో ఒకరిని లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వెలువడ్డాయి. జట్టు సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రపంచకప్ వంటి కీలక టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో విదేశీ మహిళా క్రీడాకారిణులపై ఈ తరహా దుశ్చర్య జరగడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

Details

ఆటగాళ్లను సురక్షితంగా హోటళ్ కు తీసుకొచ్చిన సిబ్బంది

గురువారం ఉదయం ఆస్ట్రేలియా మహిళా జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఖజ్రానా రోడ్ సమీపంలోని హోటల్ నుంచి సమీప కేఫ్‌కి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తి వారిని వెంబడించి, వారిలో ఒకరిని అనుచితంగా తాకి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో షాక్‌కి గురైన ఆటగాళ్లు వెంటనే తమ జట్టు భద్రతా అధికారి డానీ సిమ్మన్స్‌కి సమాచారం అందించారు. ఆయన వెంటనే స్థానిక భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసి, ఆటగాళ్లను సురక్షితంగా హోటల్‌కి తీసుకువచ్చే ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఏసీపీ హిమానీ మిశ్రా సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత ఆటగాళ్ల వాంగ్మూలాలను నమోదు చేశారు.

Details

గతంలోనూ నిందితుడిపై క్రిమినల్ కేసులు

అనంతరం ఎంఐజీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అదే సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి నిందితుడి మోటార్‌సైకిల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను గమనించి పోలీసులకు అందించాడు. ఆ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి, అఖిల్ ఖాన్‌గా నిర్ధారించారు. శుక్రవారం ఉదయం అతడిని అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఖాన్‌పై గతంలోనూ పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటన ఆస్ట్రేలియా మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో తమ చివరి గ్రూప్‌దశ మ్యాచ్ ఆడటానికి కొన్ని గంటల ముందే జరిగింది.

Details

అగ్రస్థానంలో ఆస్ట్రేలియా

ఈ మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రెండూ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాయి. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ ఫలితం గ్రూప్-ఏలో టేబుల్ టాపర్‌ను నిర్ణయించనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 11 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది, దక్షిణాఫ్రికా 10 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా గెలిస్తే వారు టాప్‌లో నిలుస్తారు, లేదంటే ఆస్ట్రేలియానే టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. ఈ మ్యాచ్ భారత మహిళల జట్టుకూ కీలకంగా మారనుంది, ఎందుకంటే సెమీ ఫైనల్‌లో వారు గ్రూప్ ఛాంపియన్ జట్టుతోనే తలపడనున్నారు.