LOADING...
ICC Mens T20 World Cup: అంచనాలను దాటుతున్న పసికూనలు.. వరల్డ్‌కప్‌లో గర్జిస్తున్న చిన్న జట్లు!
అంచనాలను దాటుతున్న పసికూనలు.. వరల్డ్‌కప్‌లో గర్జిస్తున్న చిన్న జట్లు!

ICC Mens T20 World Cup: అంచనాలను దాటుతున్న పసికూనలు.. వరల్డ్‌కప్‌లో గర్జిస్తున్న చిన్న జట్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2026
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఈసారి మొత్తం 20 జట్లు బరిలో నిలిచాయి. అందులో పది అసోసియేట్ దేశాలే ఉండటంతో, ఇవి ఎంతమేర పోటీ ఇస్తాయన్న సందేహాలు టోర్నీ ప్రారంభానికి ముందు వినిపించాయి. గ్రూప్ దశలో మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగుతాయేమోనన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే బలహీనంగా భావించిన జట్లు అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఏకపక్షం అనుకున్న మ్యాచ్‌లు హోరాహోరీగా మారుతున్నాయి. చిన్న జట్లు ధైర్యంగా ఆడుతున్నప్పటికీ, విజయం-ఓటమి మధ్యనున్న సన్నని గీతను మాత్రం దాటలేక త్రుటిలో పరాజయం చెందుతున్నాయి.

Details

అనుభవలేమితో ఆఖర్లో తడబాటు

కొన్ని కారణాల వల్ల ఈసారి టోర్నీ ఆరంభంలో పెద్దగా సందడి కనిపించలేదు. కానీ తొలి నాలుగు-ఐదు రోజుల్లో మ్యాచ్‌లు సాగిన తీరు చూసిన తర్వాత అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. మొదటి రెండు రోజుల్లో ఆరు మ్యాచ్‌లు జరిగాయి. ఒక వైపు అగ్ర జట్లు, మరోవైపు చిన్న జట్లు పోటీపడ్డాయి. కాగితంపై చూస్తే భారీ తేడా కనిపించినా, మైదానంలో మాత్రం అలా కాలేదు. ఒక్క మ్యాచ్ కూడా పూర్తిగా ఏకపక్షంగా సాగలేదు. చిన్న జట్లు గట్టి పోటీ ఇచ్చి, కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థులకు ఓటమి భయం కూడా కలిగించాయి. అయితే చివరి దశలో అనుభవలేమి కారణంగా గెలుపు గీత దాటలేకపోయాయి.

Details

తొలి మ్యాచ్‌లోనే షాక్ దాదాపు

టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లోనే సంచలనం నమోదు కావాల్సింది. నెదర్లాండ్స్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన పాకిస్థాన్ ఒక దశలో 114/7తో కష్టాల్లో పడింది. చివరి రెండు ఓవర్లలో 29 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటమి ఖాయం అనిపించిన వేళ, 19వ ఓవర్లో వాన్‌బీక్ తడబడటం మ్యాచ్ మలుపు తిప్పింది. ఆ ఓవర్లో ఫహీమ్ అష్రాఫ్ మూడు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి పాక్ వైపు గాలి మళ్లించాడు. ఆ ఒక్క ఓవర్ కట్టుదిట్టంగా ఉంటే పెద్ద సంచలనం నమోదయ్యేది.

Advertisement

Details

ఆఖరి ఓవర్లలో తేడా

అదే రోజు వెస్టిండీస్‌కు స్కాట్లాండ్ గట్టి సవాల్ విసిరింది. 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 133/5తో దూసుకెళ్లినా, చివరి ఓవర్లలో తడబడి ఓటమి చవిచూసింది. శనివారం రాత్రి భారత జట్టుకు అమెరికా ముచ్చెమటలు పట్టించింది. రికార్డుల మోతే అనుకున్న మ్యాచ్‌లో భారత్ 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 130 పరుగులు కూడా కష్టంగా కనిపించిన వేళ సూర్యకుమార్ మెరుపులతో జట్టు 161 పరుగులకు చేరింది. అమెరికా బ్యాటింగ్‌లో పోరాడినా, భారత బౌలర్లు అవకాశమివ్వలేదు.

Advertisement

Details

టోర్నీకే హైలెట్

ఇంగ్లాండ్-నేపాల్ మ్యాచ్ ఈ టోర్నీకి హైలెట్‌గా నిలిచేలా ఉంది. 185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎదుర్కొంటూ నేపాల్ భయపడలేదు. ఇంగ్లిష్ బౌలర్లపై ఎదురు దాడి చేసి 19 ఓవర్లలో 175 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 10 పరుగులు అవసరమైన వేళ గెలుపు ఆశలు మెండుగా కనిపించాయి. కానీ సామ్ కరన్ అద్భుత యార్కర్లతో లోకేష్ బామ్‌ను కట్టడి చేయడంతో నేపాల్ త్రుటిలో ఓడింది. ఒత్తిడి, అనుభవలేమి ఆ జట్టుకు చేటయ్యాయి. అఫ్గానిస్థాన్‌ను ఇక పసికూన అనలేం. అయినా న్యూజిలాండ్‌తో పోలిస్తే చిన్న జట్టే. అయినప్పటికీ 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి సవాల్ విసిరింది. ఛేదనలో 14 పరుగులకే రెండు వికెట్లు తీసి ఒత్తిడి సృష్టించింది.

Details

ఐర్లాండ్, అఫ్గాన్ పోరాటం

అయితే టిమ్ సీఫర్ట్, గ్లెన్ ఫిలిప్స్‌ను అడ్డుకోలేకపోయింది. శ్రీలంకతో మ్యాచ్‌లో ఐర్లాండ్ కూడా విజయానికి చేరువైంది. కానీ చివర్లో తడబడి ఓడింది. ఇక అఫ్గాన్ తన రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు గట్టి సవాల్ విసిరింది. 188పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ చివరి మూడు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన స్థితికి చేరుకుంది. గెలుపు అంచుల దాకా వెళ్లినా మ్యాచ్ టై అయింది. తొలి సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అవసరమైంది. అందులో అఫ్గాన్ త్రుటిలో పరాజయం పాలైంది. ఇలా చిన్న జట్లు అద్భుత ప్రదర్శనతో టోర్నీకి కొత్త ఉత్సాహం తీసుకొస్తున్నాయి. మ్యాచ్‌ల తీరును గమనిస్తే ఇకపై ఏ పెద్ద జట్టూ చిన్న జట్లను తేలిగ్గా తీసుకోదన్నది స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement