LOADING...
Smriti Mandhana: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో స్మృతి మంధాన
అరుదైన రికార్డుకు అడుగు దూరంలో స్మృతి మంధాన

Smriti Mandhana: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో స్మృతి మంధాన

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2025
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మరో చారిత్రక రికార్డు దిశగా దూసుకెళ్తోంది. ఆమెకు ఇప్పుడు ఓ అరుదైన ఘనతకు కేవలం 62 పరుగుల దూరమే ఉంది. మరో 62 రన్స్ చేస్తే 2025 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా స్మృతి మంధాన నిలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను కూడా ఆమె అధిగమించనుంది. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి స్మృతి మంధాన 1,703 పరుగులు సాధించగా, శుభ్‌మన్ గిల్ 1,764 పరుగులతో ముందున్నాడు. మహిళల క్రికెట్‌లో ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మంధాన నిలిచింది.

Details

ఫామ్ లో లేని మంధాన

ఇప్పుడు మొత్తం అంతర్జాతీయ క్రికెట్‌లోనే టాప్‌లో నిలిచే ఛాన్స్ ఆమెకు దగ్గరైంది.అయితే ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ ప్రారంభ మ్యాచ్‌ల్లో స్మృతి పెద్దగా రాణించలేదు. ఆ మ్యాచ్‌ల్లో మరికొన్ని పరుగులు చేసి ఉంటే ఇప్పటికే శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టి ఉండేదన్న చర్చ సాగుతోంది. కానీ తిరువనంతపురం వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆమె తన అసలైన క్లాస్ చూపించింది. ఈ మ్యాచ్‌లో 48 బంతుల్లోనే 80 పరుగులు చేసిన స్మృతి, 11 ఫోర్లు, 3 సిక్సర్లతో ప్రేక్షకులను అలరించింది. ఇక మరికొన్ని గంటల్లోనే ఐదో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది.

Details

ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డు

ఈ మ్యాచ్‌లో కూడా స్మృతి మంధాన భారీ ఇన్నింగ్స్ ఆడితే, 2025లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించే అవకాశముంది. స్మృతి మంధాన కెరీర్ గణాంకాల విషయానికి వస్తే, ఇప్పటివరకు ఆమె 7 టెస్టుల్లో 57.18 యావరేజ్‌తో 629 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. అలాగే 117 వన్డే మ్యాచ్‌ల్లో 48.38 యావరేజ్‌తో 5,322 పరుగులు సాధించింది. వన్డేల్లో ఆమె ఖాతాలో 14 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో ప్రస్తుతం ఆమె ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు 157 టీ20 మ్యాచ్‌ల్లో 4,102 పరుగులు చేసి తన స్థిరత్వాన్ని నిరూపించుకుంది.

Advertisement