LOADING...
Women's World Cup:ఆస్ట్రేలియా తర్వాత సెమీస్‌లోకి సౌతాఫ్రికా .. ఆ మూడు జట్లు దాదాపు ఔట్.. భారత్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే? 
ఆస్ట్రేలియా తర్వాత సెమీస్‌లోకి సౌతాఫ్రికా .. ఆ మూడు జట్లు దాదాపు ఔట్.. భారత్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

Women's World Cup:ఆస్ట్రేలియా తర్వాత సెమీస్‌లోకి సౌతాఫ్రికా .. ఆ మూడు జట్లు దాదాపు ఔట్.. భారత్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2025
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా తర్వాత మరో జట్టు మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో సెమీఫైనల్స్‌కు అడుగుపెట్టింది. అదే దక్షిణాఫ్రికా. కొలంబోలోని ఆర్. ప్రేమదాసా స్టేడియంలో న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం ఈ ఎంట్రీకి దారితీసింది. ఈ ఫలితంతో టోర్నమెంట్ నుంచి మూడు జట్లు తప్పుకోవడం దాదాపు ఖాయమైంది. ఇదే సమయంలో భారత జట్టుకు టాప్-4లోకి ప్రవేశించే అవకాశం ఇంకా కొనసాగుతోంది.

Details

గేమ్‌ ప్లాన్‌ను మార్చేసిన వర్షం  

కొలంబో వేదిక ఇప్పటికే వరుసగా మ్యాచులను వర్షంతో నిరాశపరుస్తోంది. న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్ ఈ ప్రపంచకప్‌లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లకు ఒకో పాయింట్ దక్కింది. ఈ పరిణామంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సెమీఫైనల్స్ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ సోఫీ డివైన్, వర్షం అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మునీబా అలీ మరియు ఒమైమా సోహైల్ తొలి వికెట్‌కు 30 పరుగులు జోడించారు. లియా తహుహు ఏడో ఓవర్‌లో ఒమైమాను పెవిలియన్‌కు పంపగా, జెస్ కెర్ తర్వాతి ఓవర్‌లో మునీబాను ఔట్ చేసింది. మునీబా 26 బంతుల్లో 22 పరుగులు చేసి అవుటైంది.

Details

 మ్యాచును రద్దు చేసిన అధికారులు

సిద్రా అమీన్, అలియా రియాజ్ ఇంకా స్కోరును ముందుకు తీసుకెళ్తున్న సమయంలో వర్షం మొదలైంది. పవర్‌ప్లే ముగిసే సమయానికి స్కోరు 39/2. మ్యాచ్‌ను దాదాపు గంటన్నర నిలిపివేశారు. తర్వాత 46 ఓవర్లకు మ్యాచ్ కుదించారు. 12.2 ఓవర్లలో 52/3 నుంచి పాకిస్తాన్ ఇన్నింగ్స్ తిరిగి ప్రారంభమైంది. మొత్తం 25 ఓవర్లలో స్కోరు 92/5కు చేరింది. మళ్లీ వర్షంతో ఆట ఆగిపోయింది. దీనిని 36 ఓవర్ల ఫార్మాట్‌కు మార్చినా, వర్షం ఆగకపోవడంతో చివరకు మ్యాచ్ పూర్తిగా రద్దు అయింది.

Details

సెమీఫైనల్ రేసు నుంచి మూడు జట్లు బయటకేనా?

ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం న్యూజిలాండ్‌కు ఆస్కారాలు చాలా స్వల్పం. ఐదు మ్యాచ్‌ల్లో 4 పాయింట్లతో కివీస్ ఐదో స్థానంలో ఉంది. మరోవైపు పాకిస్తాన్‌కు పరిస్థితి ఇంకా క్లిష్టం. వర్షం ప్రభావంతో రెండు మ్యాచ్‌లను మాత్రమే పూర్తి చేయగలిగిన పాక్ జట్టుకు 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అది చివర స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ కూడా ఇలాగే 5 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించి 2 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సెమీఫైనల్స్ రేసు నుంచి తప్పుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

Details

భారత్‌కు ఇంకా అవకాశమే

టీమిండియా వరుసగా రెండు ఓటములు ఎదుర్కొన్నప్పటికీ టోర్నమెంట్‌లో నిలబడే ఛాన్స్ ఇంకా ఉంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి, రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించిన భారత జట్టు నాలుగో స్థానంలో ఉంది. అక్టోబర్ 19న ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్ కీలకం కానుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే సెమీఫైనల్ దిశగా భారత్ దూసుకెళ్లే అవకాశం బలపడుతుంది. తర్వాత న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లలో ఒక్క గెలుపు వచ్చినా టీమిండియాకు సెమీఫైనల్స్ దాదాపు ఖాయం కావొచ్చు.