LOADING...
T20 World Cup: జింబాబ్వేపై దక్షిణాఫ్రికా గెలుపు
జింబాబ్వేపై దక్షిణాఫ్రికా గెలుపు

T20 World Cup: జింబాబ్వేపై దక్షిణాఫ్రికా గెలుపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2026
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ 2026లో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్‌ దశను అజేయంగా ముగించిన ప్రోటీస్‌ జట్టు, సూపర్‌-8లో కూడా ఓటమి రుచి చూడలేదు. ఇప్పటికే సెమీఫైనల్‌ బర్త్‌ ఖరారు చేసుకున్న దక్షిణాఫ్రికా.. మార్చి 1న జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. టాస్‌ గెలిచిన జింబాబ్వే ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుని 20 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేసింది. 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్‌ సికిందర్ రాజా ఆదుకున్నాడు. 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేసి పోరాటపటిమ చూపించాడు.

Details

రాణించని మిగతా బ్యాటర్లు

క్లైవ్‌ మదండే 20 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. మరుమణి 7, బ్రియాన్‌ బెన్నెట్‌ 15, డియాన్‌ మైర్స్‌ 11, ర్యాన్‌ బర్ల్‌ 5, టోనీ మున్యోంగా 2, బ్రాడ్‌ ఈవాన్స్‌ 8 పరుగులు మాత్రమే చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మఫాకా, కార్బిన్‌ బాష్‌ చెరో రెండు వికెట్లు సాధించగా, లిండే, ఎంగిడి, నోర్జే తలో వికెట్‌ దక్కించుకున్నారు. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను రజా బంతితోనూ ఇబ్బంది పెట్టాడు. 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చాడు.

Details

నిరాశపరిచిన మార్క్రమ్, డికాక్

అయితే మధ్యవరుస బ్యాటర్లు సమయోచితంగా ఆడి జట్టును గెలుపు దిశగా నడిపించారు. ఓపెనర్లు మార్క్రమ్‌ (4), డికాక్‌ (0) నిరాశపరిచినా, రికెల్టన్‌ 31, బ్రెవిస్‌ 42, మిల్లర్‌ 22, స్టబ్స్‌ 21 నాటౌట్‌, లిండే 30 నాటౌట్‌ రాణించి లక్ష్యాన్ని ఛేదించారు. జింబాబ్వే బౌలర్లలో రజాతో పాటు ముజరబానీ (3.5-0-32-1), బ్రాడ్‌ ఈవాన్స్‌ (3-0-22-1) ఒక్కో వికెట్‌ తీశారు. ఈ పరాజయంతో జింబాబ్వే ప్రపంచకప్‌ ప్రయాణం ముగిసింది. అయితే గ్రూప్‌ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకపై సంచలన విజయాలు నమోదు చేసి టోర్నీలో గుర్తింపు పొందింది.

Advertisement