
Harbhajan - Sreesanth: శ్రీశాంత్ కుమార్తె మాటలు నా మనసును కలచివేశాయి : హర్భజన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ 2008లో ప్రారంభమైంది. ఆ ఎడిషన్ మరిచిపోలేని ఘటనగా హర్భజన్ సింగ్ - శ్రీశాంత్ మధ్య చోటుచేసుకున్న వివాదం నిలిచింది. మ్యాచ్ అనంతరం హర్భజన్ శ్రీశాంత్ చెంపపై కొట్టిన సంఘటన అప్పట్లో పెద్ద దుమారం రేపింది.ఇది జరిగిన 17 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అప్పుడప్పుడు ఆ ఘటనపై చర్చలు వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా ఆ ఉదంతాన్ని మరోసారి గుర్తు చేసుకున్న మాజీస్పిన్నర్ హర్భజన్ సింగ్, పశ్చాత్తాపంతో కూడిన భావోద్వేగాలను వ్యక్తపరిచాడు. అశ్విన్ యూట్యూబ్ ఛానల్‌లో హర్భజన్ మాట్లాడుతూ.. ఆ ఘటనపై ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా తన మనస్సులో మచ్చగా మిగిలిపోతోందన్నారు. తన జీవితంలో ఏదైనా మార్పు చేసుకునే అవకాశం వస్తే అదే తప్పును సరిదిద్దుకుంటానని స్పష్టం చేశాడు
Details
ఒక్క అవకాశం వస్తే.. ఆ ఘటననే తొలగించుకుంటా
'నా జీవితంలో ఏదైనా ఒక్క విషయం మార్చుకొనే అవకాశం వస్తే, అది శ్రీశాంత్‌తో జరిగిన సంఘటనే అవుతుంది. నా కెరీర్ నుంచే ఆ చాప్టర్‌ను తొలగించాలనుకుంటున్నా. అది పూర్తిగా నా తప్పే. అలా చేయకూడదని అప్పుడే తెలుసుకోవాల్సింది. అప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పానో నాకే గుర్తు లేదు. 200 సార్లైనా చెప్పి ఉండొచ్చు. ప్రతి సందర్భంలోనూ ఆ ఘటన నా మనసును కుదిపేస్తూనే ఉంటుంది. తప్పులు చేయడం మానవ సహజం. కానీ అదే తప్పును మళ్లీ చేయకూడదు. మేం టీమ్‌మేట్లు. ఎన్నో మ్యాచులు కలిసి ఆడాం. కానీ, ఆ రోజు మేము ప్రత్యర్థులుగా ఉన్నాం. అయినా సరే, అలా దురుసుగా ప్రవర్తించకూడదని అర్థమైంది.
Details
నాతో మాట్లాడనని చెప్పింది
శ్రీశాంత్ నన్ను రెచ్చగొట్టినా.. నేను అలా చేయడం చాలా పెద్ద తప్పే. వెంటనే క్షమాపణ చెప్పాను కూడా" అని హర్భజన్ వ్యాఖ్యానించాడు. అంతేకాదు, కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీశాంత్ కుమార్తెను ఓ కార్యక్రమంలో కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న హర్భజన్, ఆ చిన్నారి తనతో మాట్లాడకుండా చెప్పిన మాటలు తనను ఎంతగానో బాధించాయని చెప్పాడు. 'ఆ ఘటన జరిగిన చాలా సంవత్సరాల తర్వాత శ్రీశాంత్ కుమార్తెను కలిశాను. ఆమెతో ప్రేమగా మాట్లాడాలనుకున్నాను. కానీ ఆ చిన్నారి మాత్రం.. 'నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు. నువ్వు మా నాన్నను కొట్టావు' అంటూ మాట్లాడింది.
Details
నా జీవితంతో అది చేదు అనుభవం
ఆ మాటలు విన్న వెంటనే నా హృదయం దిగేసింది. కళ్లు చెమ్మగిల్లాయి. ఆమెను ఇంప్రెస్ చేయడానికి నేనేం చేయగలను అని నాలో నేనే ప్రశ్నించుకున్నా.ఆమెను అలాంటి కోణంలో చూడకూడదనిపించింది. ఆమెకు నేనెప్పుడూ అంకుల్‌లా మద్దతుగా ఉంటాను.నాపై ఆమె అభిప్రాయం మారాలని కోరుకుంటున్నా. నేను అలాంటి వ్యక్తిని కాదని, తప్పు చేసి తెలుసుకున్నవాడిని అని నిరూపించుకోవడానికి ఏమైనా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఆమె పెద్దయ్యాక నా గురించి అదే అభిప్రాయంతో ఉండకూడదని ఆశిస్తున్నాను. ఇదంతా నా జీవితంలో చేదు అనుభవం. దాన్ని నా కెరీర్ నుంచి పూర్తిగా తీసేయాలని కోరుకుంటున్నానని హర్భజన్ హృదయవిదారకంగా చెప్పారు. శ్రీశాంత్ కుమార్తె ఈ మాటలు ఎప్పుడు అన్నదీ, ఆ సందర్భం ఎప్పుడు జరిగిందన్న వివరాలను మాత్రం హర్భజన్ వెల్లడించలేదు.