Loading...
Sri Shankar: కామన్వెల్త్‌లో మరోసారి మెరిసిన శ్రీశంకర్‌.. వరుసగా రెండోసారి రజత పతకం
కామన్వెల్త్‌లో మరోసారి మెరిసిన శ్రీశంకర్‌.. వరుసగా రెండోసారి రజత పతకం

Sri Shankar: కామన్వెల్త్‌లో మరోసారి మెరిసిన శ్రీశంకర్‌.. వరుసగా రెండోసారి రజత పతకం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2026
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత స్టార్‌ లాంగ్‌జంపర్‌ మురళీ శ్రీశంకర్‌ మరోసారి తన ప్రతిభను చాటాడు. పురుషుల లాంగ్‌జంప్‌ ఫైనల్లో 8.09 మీటర్ల అత్యుత్తమ ప్రయత్నంతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్‌ క్రీడల్లో వరుసగా రెండోసారి సిల్వర్‌ మెడల్‌ సాధించిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. పోటీలో తొలి ప్రయత్నంలోనే 8.03 మీటర్లు దూకిన శ్రీశంకర్‌ శుభారంభం చేశాడు. అనంతరం రెండో ప్రయత్నంలో 8.09 మీటర్ల దూరం నమోదు చేసి తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ దూరమే అతడికి రెండో స్థానాన్ని ఖరారు చేసింది. ఇది శ్రీశంకర్‌కు కామన్వెల్త్‌ గేమ్స్‌లో వరుసగా రెండో రజత పతకం కావడం విశేషం.

వివరాలు

ఐదో స్థానంలో నిలిచి అత్యుత్తమ ప్రతిభ

అంతకుముందు 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో కూడా 8.08 మీటర్ల జంప్‌తో రెండో స్థానంలో నిలిచి సిల్వర్‌ మెడల్‌ అందుకున్నాడు.

మరో భారత లాంగ్‌జంపర్‌ లోకేశ్‌ సత్యనాథన్‌ 7.70 మీటర్ల అత్యుత్తమ ప్రయత్నంతో ఐదో స్థానంలో నిలిచాడు.

ఈ ఈవెంట్‌లో జమైకాకు చెందిన తజయ్‌ గేల్‌ 8.15 మీటర్ల జంప్‌తో స్వర్ణ పతకం సాధించగా, స్కాట్లాండ్‌కు చెందిన స్టీఫెన్‌ మెకెంజీ 8.08 మీటర్లతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

ఇక పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో భారత అథ్లెట్లు సంతోష్‌ కుమార్‌ తమిళరాసన్, యశస్‌ పలాక్ష ఫైనల్‌కు అర్హత సాధించారు.

సెమీఫైనల్లో సంతోష్‌ 49.51 సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలవగా, యశస్‌ 49.65 సెకన్లతో ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌లోకి ప్రవేశించాడు.

ADVERTISEMENT