LOADING...
IPL 2026: పెద్ద పర్స్, చిన్న నిర్ణయాలు: సన్‌రైజర్స్ మినీ వేలం కథ
పెద్ద పర్స్, చిన్న నిర్ణయాలు: సన్‌రైజర్స్ మినీ వేలం కథ

IPL 2026: పెద్ద పర్స్, చిన్న నిర్ణయాలు: సన్‌రైజర్స్ మినీ వేలం కథ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
08:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్ అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. అబుదాబి వేదికగా మంగళవారం జరిగిన ఈ వేలంలో రూ.25.5 కోట్ల భారీ పర్స్‌తో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ ఆశించిన స్థాయిలో దూకుడుగా వ్యవహరించలేకపోయింది. ఇప్పటికే ప్రధాన ఆటగాళ్లను జట్టులోనే కొనసాగించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, వారికి సరైన ప్రత్యామ్నాయ ఆటగాళ్లను సమకూర్చడంలో విఫలమైంది. గత సీజన్‌లో జట్టు ప్రదర్శనను దెబ్బతీసిన బలహీనతలను కూడా ఈ వేలంలో సరిచేసుకోలేకపోయింది.

వివరాలు 

పేరున్న ఆటగాళ్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ బిడ్  వేయకపోవడం విమర్శలకు దారి తీసింది.

ముఖ్యంగా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్థానాన్ని భర్తీ చేసే నాణ్యమైన బౌలర్‌ను కొనుగోలు చేయడంలో జట్టు పూర్తిగా విఫలమైంది. అంతేకాదు, చేతిలో భారీగా నిధులు ఉన్నప్పటికీ స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తీసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పేరున్న పలువురు ఆటగాళ్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ బిడ్ కూడా వేయకపోవడం విమర్శలకు దారి తీసింది. అభిమానులు ఊహించినట్టే రవి బిష్ణోయ్ కోసం చివరి వరకు పోరాడిన సన్‌రైజర్స్, చివర్లో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. రూ.7 కోట్ల వరకు బిడ్ వేసిన ఆరెంజ్ ఆర్మీ, రాజస్థాన్ రాయల్స్ రూ.7.20 కోట్ల ఆఫర్ ఇవ్వడంతో చేతులెత్తేసింది.

వివరాలు 

లియామ్ లివింగ్‌స్టోన్‌కు భారీ ధర

పేర్లకు పెద్దగా పరిచయం లేని ఆటగాళ్ల కోసం మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టిగానే ప్రయత్నించింది. స్పిన్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్, వికెట్‌కీపర్-బ్యాటర్ కార్తీక్ శర్మ, పేస్ ఆల్‌రౌండర్ అకీబ్ దార్ ల కోసం బిడ్డింగ్‌లో పాల్గొన్నప్పటికీ చివరకు వారిని దక్కించుకోలేకపోయింది. అయితే ఆశ్చర్యకరంగా మొదట అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన లియామ్ లివింగ్‌స్టోన్‌ను తిరిగి పిలిపించి రూ.13 కోట్ల భారీ ధర చెల్లించి కొనుగోలు చేసింది. ఈ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకున్న నిర్ణయాలు అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులను కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. వేలంలో ఆశించిన స్థాయిలో ఆటగాళ్లను దక్కించుకోలేకపోయినా, జట్టు కోర్ మాత్రం బలంగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

అయితే భారతీయ స్పెషలిస్ట్ పేసర్, నాణ్యమైన స్పిన్నర్ లోటు మాత్రం జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండు స్థానాల్లో అనామక ఆటగాళ్లు అంచనాలను మించి రాణిస్తే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తిరుగు ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సలీల్ అరోరా - రూ.1.50 కోట్లు శివాంగ్ కుమార్ - రూ.30 లక్షలు క్రెయిన్స్ ఫులెట్రా - రూ.30 లక్షలు సాకిబ్ హుస్సేన్ - రూ.30 లక్షలు ఓంకార్ తర్మలె - రూ.30 లక్షలు ప్రఫుల్ హింగే - రూ.30 లక్షలు అమిత్ కుమార్ - రూ.30 లక్షలు లియామ్ లివింగ్‌స్టోన్ - రూ.13 కోట్లు శివమ్ మావి - రూ.75 లక్షలు

Advertisement

వివరాలు 

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ లిస్ట్: 

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కామిందు మెండీస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ. సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా) ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, లియామ్ లివింగ్ స్టోన్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనాద్కత్.

Advertisement