Abhishek Sharma: 22 బంతుల్లో 59 పరుగులు.. 2 వేల రన్స్ క్లబ్‌లోకి అభిషేక్ శర్మ ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు చెందిన డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2,000 పరుగుల మైలురాయిని దాటేశారు. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌తో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఈ ఘనతను అందుకున్నారు. మ్యాచ్‌కు ముందు ఆయనకు ఈ రికార్డు చేరడానికి 55 పరుగులు అవసరం ఉండగా, 22 బంతుల్లోనే 59 పరుగులు చేసి దూకుడుగా ఇన్నింగ్స్ ముగించారు.
వివరాలు
ఐపీఎల్ కెరీర్ మొదలైందిలా..
అభిషేక్ తన ఐపీఎల్ కెరీర్‌ను 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ప్రారంభించారు. ఆ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. ఆ తర్వాత 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మారి అప్పటి నుంచి అదే జట్టుకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నారు. తాజా ఇన్నింగ్స్‌తో కలిపి అభిషేక్ ఇప్పటివరకు 83 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో (80 ఇన్నింగ్స్‌లు) 2,004 పరుగులు చేశారు. ఆయన బ్యాటింగ్ సగటు 27కి పైగా ఉండగా, స్ట్రైక్ రేట్ 167.55గా ఉంది. ఇప్పటివరకు 11 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.
వివరాలు
ఆ లిస్టులోకి ఎంట్రీ..
ఈ సీజన్‌లోనే అభిషేక్ మరో రికార్డు కూడా సృష్టించారు. 20 బంతుల లోపే ఐదు హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. ఇప్పుడు అదే జాబితాలో తన 6వ వేగవంతమైన హాఫ్ సెంచరీని కూడా నమోదు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్‌పై 15 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసి చివరకు 22 బంతుల్లో 59 పరుగులు చేశారు. ఈ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదారు. SRH తరఫున చూస్తే అభిషేక్ ఇప్పటివరకు 1,941 పరుగులు చేశారు. SRH తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ (4,014), శిఖర్ ధావన్ (2,518), కేన్ విలియమ్సన్ (2,101) మాత్రమే ఆయన కంటే ముందున్నారు.
వివరాలు
దూసుకెళ్తున్న అభిషేక్ శర్మ..
సిక్సర్ల విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ కోసం 100కి పైగా సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు కేవలం డేవిడ్ వార్నర్ (143), అభిషేక్ శర్మ (113) మాత్రమే కావడం విశేషం. మరోవైపు మొత్తం T20 కెరీర్‌లో కూడా అభిషేక్ దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 187 T20 మ్యాచ్‌ల్లో 5,429 పరుగులు చేశారు. ఇందులో 8 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 341 సిక్సర్లు, 508 ఫోర్లు బాదారు.