SRH: సన్‌రైజర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. మ్యాచ్ విన్నర్ దూరం.. కావ్యపాప కీలక నిర్ణయం..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో భారీ లోటు ఏర్పడింది. యువ పేసర్ శివమ్ మావికి గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లన్నింటి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సీజన్‌లో హైదరాబాద్ బౌలింగ్ దళానికి మావీ ముఖ్య బలం అవుతాడని ముందుగా అంచనా వేశారు. కానీ వరుసగా ఎదురైన గాయాల సమస్యల వల్ల ఆయన ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశాన్ని పొందలేదు. కీలక దశలో ప్రధాన బౌలర్ జట్టుకు దూరం కావడం, వారి వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశముంది.
వివరాలు
శివం మావీని దూరం చేసిన గాయం..
మావీ టోర్నీ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం గాయం (గ్రోయిన్ ఇంజరీ). టోర్నమెంట్ ప్రారంభం నుంచే ఈ సమస్య ఆయనను ఇబ్బంది పెట్టింది. జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుని, ఫిట్‌నెస్ పరీక్షలు కూడా పూర్తి చేసినప్పటికీ, మ్యాచ్‌లకు సిద్ధమయ్యే స్థాయిలో ఆయన కోలుకోలేకపోయాడు. వైద్యులు పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని సూచించడంతో, ఈ సీజన్ మొత్తానికి దూరమవ్వాల్సి వచ్చింది. మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యం ఉన్న ఆటగాడు ఇలా మధ్యలోనే వైదొలగడం ఫ్రాంచైజీకి నిరాశ కలిగించింది.
వివరాలు
జట్టులోకి అండర్-19 ప్లేయర్ అంబరీష్..
మావీ స్థానాన్ని భర్తీ చేయడానికి సన్‌రైజర్స్ యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకుంది. ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 18 ఏళ్ల యువ ఆల్‌రౌండర్ ఆర్ఎస్ అంబరీష్‌ను జట్టులోకి చేర్చింది. ఆ టోర్నీలో అతని కట్టుదిట్టమైన బౌలింగ్ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేసింది. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడంలో ముందుండే హైదరాబాద్ ఫ్రాంచైజీ, అంబరీష్‌ను ఎంపిక చేయడం ద్వారా జట్టు సమతుల్యతను నిలబెట్టుకోవాలని భావిస్తోంది.