Loading...
Asia Cup Rising Stars 2026: సెంచరీలతో చెలరేగిన లంక ఓపెనర్లు.. చిత్తుగా ఓడిన యువ భారత్!
సెంచరీలతో చెలరేగిన లంక ఓపెనర్లు.. చిత్తుగా ఓడిన యువ భారత్!

Asia Cup Rising Stars 2026: సెంచరీలతో చెలరేగిన లంక ఓపెనర్లు.. చిత్తుగా ఓడిన యువ భారత్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2026
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో యువ భారత్‌కు నిరాశ ఎదురైంది. ఫైనల్‌కు చేరాలన్న టీమిండియా ఆశలపై శ్రీలంక నీళ్లు చల్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్‌లో భారత్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన లంక.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. 314 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 41.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లంక ఓపెనర్లు సినేత్ జయవర్దనే (105; 70 బంతుల్లో), లసిత్ క్రూస్‌పుల్లే (116) సెంచరీలతో చెలరేగి భారత బౌలింగ్‌ను చిత్తు చేశారు. భారత బౌలర్లలో షహబాజ్ అహ్మద్, హర్షిత్ రాణా తలో వికెట్ పడగొట్టారు.

వివరాలు

ఓపెనర్ల ధాటికి భారత బౌలర్లు విలవిల

314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. లసిత్ క్రూస్‌పుల్లే, సినేత్ జయవర్దనే భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు.

ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరి ధాటికి భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు.

ఈ క్రమంలో సినేత్ జయవర్దనే కేవలం 62 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. చివరకు 21.3 ఓవర్ల వద్ద షహబాజ్ అహ్మద్ అతడిని ఔట్ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు.

అప్పటికే శ్రీలంక స్కోరు 174 పరుగులకు చేరింది. అంటే ఛేదించాల్సిన లక్ష్యంలో సగానికి పైగా పరుగులను ఓపెనర్లే సాధించారు. ఆ తర్వాత నిషాన్ మధుషంక (58 నాటౌట్)తో కలిసి లసిత్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.

వివరాలు

అభిషేక్, తిలక్, షహబాజ్ హాఫ్ సెంచరీలు

సెంచరీ పూర్తి చేసుకున్న లసిత్.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అనంతరం పవన్ రత్నాయకే (31 నాటౌట్)తో కలిసి మధుషంక లాంఛనాన్ని పూర్తి చేశాడు.

దీంతో శ్రీలంక మరో 8.3 ఓవర్లు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. అంతకుముందు టాస్ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది.

ఓపెనర్ అభిషేక్ శర్మ (78), కెప్టెన్ తిలక్ వర్మ (53), షహబాజ్ అహ్మద్ (54 నాటౌట్) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు.

వైభవ్ సూర్యవంశీ (40), తనుష్ కొటియాన్ (28) కూడా తమ వంతు సహకారం అందించారు. దీంతో టీమిండియా 313 పరుగుల పోరాడదగ్గ స్కోరు సాధించింది.

ADVERTISEMENT

వివరాలు

లంక బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలం

శ్రీలంక బౌలర్లలో రవిందు ఫెర్నాండో, జనిత్ లియానగే, నిపున్ ధనంజయ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

గరుక సంకేత్, లహిరు సమరకూన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

అయితే భారీ స్కోరు చేసినప్పటికీ భారత బౌలర్లు లంక బ్యాటర్లను కట్టడి చేయలేకపోవడంతో యువ భారత్‌కు ఓటమి తప్పలేదు.

ADVERTISEMENT