BCCI: 'హనీట్రాప్‌లకు దూరంగా ఉండండి'.. ఐపీఎల్ జట్లకు బీసీసీఐ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ అప్రమత్తమైంది. ముఖ్యంగా ఆటగాళ్లు, జట్టు అధికారులు హనీట్రాప్‌ల వంటి ఉచ్చుల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తూ అన్ని ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్ని ఐపీఎల్ జట్లకు అధికారిక నోటీసులు పంపించారు. ఈ సీజన్‌లో కొందరు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, జట్టు అధికారులు అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్లు, పలు నిబంధనలను ఉల్లంఘించినట్లు బోర్డు దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
టీమ్ మేనేజర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి
'ఈ సమస్యలను వెంటనే నియంత్రించకపోతే టోర్నమెంట్ ప్రతిష్ఠతో పాటు సంబంధిత ఫ్రాంచైజీలు, బీసీసీఐ ప్రతిష్ఠ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ఫ్రాంచైజీలకు పంపిన ప్రకటనలో దేవ్‌జిత్ సైకియా స్పష్టం చేశారు. ఇకపై ఆటగాళ్లు, సహాయక సిబ్బంది తప్పనిసరిగా పాటించాల్సిన కఠిన నిబంధనలను కూడా బీసీసీఐ రూపొందించింది. వాటిని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. టీమ్ మేనేజర్ అనుమతి లేకుండా ఆటగాళ్లు లేదా సపోర్ట్ స్టాఫ్‌ను కలిసేందుకు ఇతరులను హోటల్ గదుల్లోకి అనుమతించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆటగాళ్లను కలిసే అతిథుల పూర్తి వివరాలను రికార్డు చేయాలని జట్లకు సూచించింది.
వివరాలు
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
అవసరమైతే ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తామని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై షోకాజ్ నోటీసులు, భారీ జరిమానాలు, సస్పెన్షన్ లేదా డిస్‌క్వాలిఫికేషన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ పేర్కొంది. అదేవిధంగా నిషేధిత పదార్థాల వినియోగం లేదా భద్రతా నిబంధనల ఉల్లంఘన వంటి అంశాల్లో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, అవసరమైతే పోలీసు కేసులు కూడా నమోదు కావచ్చని హెచ్చరించింది.