LOADING...
Sunil gavaskar: పాక్ ఆటగాళ్ల ఎంపికపై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
పాక్ ఆటగాళ్ల ఎంపికపై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

Sunil gavaskar: పాక్ ఆటగాళ్ల ఎంపికపై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 17, 2026
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ద హండ్రెడ్‌ లీగ్‌లో సన్‌రైజర్స్‌ లీడ్స్‌ జట్టులోకి పాకిస్థాన్‌కు చెందిన ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. కావ్య మారన్‌ సహ యజమానిగా ఉన్న లీడ్స్‌ ఫ్రాంఛైజీ వేలంలో అబ్రార్‌ను రూ.2.3 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి అనంతరం కూడా పాకిస్థాన్ ఆటగాడిని తీసుకోవడంపై సోషల్ మీడియాలో భారతీయులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ విధమైన స్పందన రావడం ఆశ్చర్యకరం కాదని గవాస్కర్‌ తెలిపారు.

వివరాలు

వారి వల్ల మనకే నష్టం..

పాకిస్థాన్ ఆటగాడిపై ఖర్చు చేసే డబ్బు పరోక్షంగా భారతీయుల ప్రాణనష్టానికి దారితీసే అవకాశముందని ఆయన వ్యాఖ్యానించారు. 2008లో ముంబయి ఉగ్రదాడుల తర్వాత ఐపీఎల్‌ జట్లు పాకిస్థాన్ ఆటగాళ్లను దూరంగా ఉంచుతున్నాయని, ఆలస్యమైనప్పటికీ ఈ విషయంపై ఫ్రాంఛైజీలకు అవగాహన కలిగిందన్నారు. పాకిస్థాన్ ఆటగాళ్లకు చెల్లించే పారితోషికం వారి ప్రభుత్వానికి పన్నుల రూపంలో చేరుతుందని, ఆ నిధులతో ఆయుధాలు కొనుగోలు చేసి వాటిని భారత సైనికులు, పౌరులపై ఉపయోగించే ప్రమాదం ఉందని ఆయన వివరించారు. ఈ కారణాల వల్లే భారతీయ సంస్థలు పాకిస్థాన్ కళాకారులు, క్రీడాకారులను పక్కన పెట్టుతున్నాయని చెప్పారు.

వివరాలు

టోర్నమెంటే ముఖ్యమా?

ఇక మరో పాకిస్థాన్ స్పిన్నర్ తారిఖ్‌ను కూడా పరిశీలిస్తున్నామని లీడ్స్ కోచ్ వెటోరి చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందని గవాస్కర్ తెలిపారు. న్యూజిలాండ్‌కు చెందిన వెటోరికి స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన లేకపోవచ్చని, తన జట్టులో పాకిస్థాన్ ఆటగాళ్లు ఉండాలని అతను ఆశించి ఉండవచ్చని అన్నారు. అయితే జట్టు యజమానులు పరిస్థితులను సమగ్రంగా అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. పాకిస్థాన్ ఆటగాళ్లను కొనుగోలు చేయకుండా ఉండే బాధ్యత ఫ్రాంఛైజీలదేనని స్పష్టం చేశారు. చివరగా భారతీయుల ప్రాణాల కంటే ఒక టోర్నమెంట్ గెలవడం ముఖ్యమా అని ప్రశ్నించారు.

Advertisement