IPL Records: ఐపీఎల్‌లో ఇప్పటికీ టచ్ చేయలేని రికార్డు... కొడితే లైఫ్‌టైం సెటిల్‌మెంట్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ చరిత్రలో మే 30వ తేదీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇదే రోజున 2014లో ముంబైలోని వాంఖడే స్టేడియం ఓ మరపురాని ఇన్నింగ్స్‌కు వేదికైంది. క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్దేశించిన 227 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే ప్రయత్నంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సురేష్ రైనా ఆడిన ఆ తుఫాన్ ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టుకు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 58 బంతుల్లో 122 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు అందించాడు.
వివరాలు
రైనా ఒంటరి పోరాటం..
అయితే ఆ లక్ష్యాన్ని చూసి వెనుకడుగు వేయకుండా, రైనా ఒంటరిగానే పోరాటం మొదలుపెట్టాడు. కేవలం 25 బంతుల్లోనే 87 పరుగులు చేసి స్టేడియాన్ని కుదిపేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. అంతేకాకుండా కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి, అప్పట్లో ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన ఫిఫ్టీగా రికార్డు నమోదు చేశాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి చెన్నై స్కోరు 100/2 కాగా, అందులో రైనా ఒక్కడే 87 పరుగులు చేయడం అతని ఆధిపత్యాన్ని చూపించింది. కానీ దురదృష్టవశాత్తూ పవర్‌ప్లే పూర్తైన వెంటనే తొలి బంతికే రైనా అవుట్ అయ్యాడు. మెకల్లమ్ పిలుపుతో పరుగెత్తగా, జార్జ్ బెయిలీ అద్భుతమైన డైరెక్ట్ హిట్‌తో రైనాను పెవిలియన్‌కు పంపించాడు.
వివరాలు
అదొక విధ్వంసకర రికార్డు..
రైనా ఇంకో ఐదు ఓవర్లు క్రీజులో నిలిచివుంటే మ్యాచ్ ఫలితం పూర్తిగా మారిపోయేదని అభిమానులు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. చివరికి చెన్నై జట్టు 202 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఆ ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకుంటూ రైనా, "ఆ సమయంలో నా మనసులో ఒక్కటే ఉంది... ఎలాగైనా ఫైనల్‌కు చేరాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అనుకున్నాను" అని చెప్పాడు. ఇప్పటికీ ఎంతోమంది ఆటగాళ్లు ఎన్నో దూకుడు ఇన్నింగ్స్‌లు ఆడినా, సురేష్ రైనా ఆ రోజు సృష్టించిన ఆ విధ్వంసకర రికార్డును మాత్రం ఎవరూ అధిగమించలేకపోయారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న సురేష్ రైనా పోస్ట్..
Only thing was running through my mind was not to give up & make it through. So badly wanted to make it to the finals. It will always remain a very special knock for me. #WhistlePodu https://t.co/iiuBfOk5wE
— Suresh Raina🇮🇳 (@ImRaina) May 30, 2020