
Team India: బెట్టింగ్ యాప్ వివాదంలో సురేష్ రైనా పేరు.. ఈడీ విచారణకు సమన్లు
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ క్రికెటర్, 'మిస్టర్ ఐపీఎల్' సురేష్ రైనాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణకు హాజరుకావాలని సమన్లు పంపింది. 1xBet అనే బెట్టింగ్ యాప్‌కు రైనాకు సంబంధం ఉన్నట్లు, ఆ యాప్‌కు ప్రచారకర్తగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ లావాదేవీలు, మనీలాండరింగ్ వివరాలపై స్పష్టత కోసం ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో రైనాను ప్రశ్నించనున్నారు. ఈడీ ప్రకారం, అక్రమ బెట్టింగ్ యాప్‌ల వల్ల దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల మోసాలు జరుగుతున్నాయి.
Details
ఇప్పటికే పలువురు ప్రముఖులకు నోటీసులు
ఈ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సినీ, క్రీడా ప్రముఖులపై కూడా దృష్టి సారించింది. ఇప్పటికే పలువురు నటులు, నటీమణులు, క్రికెటర్లు ఈ కేసులో విచారణకు హాజరయ్యారు. ఇటీవల నటుడు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి వంటి ప్రముఖులను కూడా తెలంగాణ పోలీసులు, ఈడీ విచారించాయి. రైనా విచారణలో భాగంగా 1xBet యాప్‌తో ఉన్న సంబంధాలు, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను అధికారులు సమగ్రంగా పరిశీలించనున్నారు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముండగా, అక్రమ బెట్టింగ్ రాకెట్లపై ఈడీ చర్యలు మాఫియాకు కట్టడి కలిగిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.