Loading...
Suryakumar Yadav: సూర్యకుమార్‌కు మరోసారి కెప్టెన్సీ.. ముంబై జట్టును నడిపించనున్న టీమిండియా స్టార్!
సూర్యకుమార్‌కు మరోసారి కెప్టెన్సీ.. ముంబై జట్టును నడిపించనున్న టీమిండియా స్టార్!

Suryakumar Yadav: సూర్యకుమార్‌కు మరోసారి కెప్టెన్సీ.. ముంబై జట్టును నడిపించనున్న టీమిండియా స్టార్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2026
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు మరో కీలక బాధ్యత దక్కింది. త్వరలో ప్రారంభం కానున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా అతడిని నియమించారు. ఈ ఏడాది ఆరంభంలో భారత టీ20 జట్టు కెప్టెన్సీ కోల్పోయిన సూర్య.. ఇప్పుడు దేశవాళీ టోర్నీలో ముంబై జట్టును నడిపించనున్నాడు. నవంబర్ 14 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది.

వివరాలు

ముంబై జట్టులో ఐదుగురు అంతర్జాతీయ క్రికెటర్లు

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో పలువురు అంతర్జాతీయ క్రికెటర్లకు చోటు కల్పించింది.

సూర్యకుమార్ యాదవ్‌తో పాటు శార్దూల్ ఠాకూర్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, తుషార్ దేశ్‌పాండే జట్టులో ఉన్నారు. అయితే వైస్ కెప్టెన్ పేరును మాత్రం ప్రకటించలేదు.

గత సీజన్‌లో అన్ని ఫార్మాట్లలోనూ శార్దూల్ ఠాకూర్ ముంబై జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే ఈసారి ఫార్మాట్‌ను బట్టి వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేశారు.

రంజీ ట్రోఫీలో సిద్ధేశ్ లాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా.. టీ20 జట్టును నడిపించే అవకాశం సూర్యకుమార్‌కు కల్పించారు.

వివరాలు

ముంబై కెప్టెన్సీపై సూర్య ఏమన్నాడంటే?

తనకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై సూర్యకుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు. ముంబై తరఫున ఆడటం ఎప్పుడూ గర్వకారణమని పేర్కొన్నాడు.

ఈసారి జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపాడు. అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లు కూడా జట్టులో ఉన్నారని చెప్పాడు.

ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసి ట్రోఫీని గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు.

ADVERTISEMENT

వివరాలు

గాయం నుంచి కోలుకుని బరిలోకి శార్దూల్.. దూబేకు అవకాశం

మరోవైపు శార్దూల్ ఠాకూర్ కూడా ఈ టోర్నీ ద్వారా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.

కుడిచేతి మధ్య వేలికి గాయం కావడంతో రంజీ ట్రోఫీ తొలి దశలో జరిగిన నాలుగు మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. చివరిసారిగా ఆగస్టులో జరిగిన దులీప్ ట్రోఫీలో ఆడాడు.

తాజాగా గాయం నుంచి కోలుకోవడంతో ముంబై జట్టులోకి తిరిగి వచ్చాడు.

ఇక న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం దక్కించుకోని శివమ్ దూబే.. ఇప్పుడు ముంబై తరఫున బరిలోకి దిగనున్నాడు.

ADVERTISEMENT

వివరాలు

ముంబై జట్టుకు దూరమైన జైస్వాల్, మరో ఇద్దరు ఆటగాళ్లు

యశస్వి జైస్వాల్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉండటంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి అందుబాటులో ఉండడు.

అలాగే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం ఎంపికైన సూర్యాన్ష్ షెడ్గే, తనుష్ కోటియన్ కూడా ముంబై జట్టుకు దూరమయ్యారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తన తొలి మ్యాచ్‌ను నవంబర్ 14న కోల్‌కతాలో హైదరాబాద్‌తో ఆడనుంది.

గ్రూప్-Dలో ముంబైతో పాటు గుజరాత్, గోవా, విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరాఖండ్ జట్లు ఉన్నాయి.

టీ20 ప్రపంచకప్ 2026లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ విజేతగా నిలిచిన నేపథ్యంలో.. ఇప్పుడు అతడి కెప్టెన్సీలో ముంబై జట్టు కూడా ఈ టోర్నీలో టైటిల్ సాధిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT