LOADING...
Sanju Samson-Jadeja : సంజూ శాంసన్-జడేజా ట్రేడ్ డీల్‌పై సస్పెన్స్‌.. చర్చలు నిలిచినట్లు సమాచారం!
సంజూ శాంసన్-జడేజా ట్రేడ్ డీల్‌పై సస్పెన్స్‌.. చర్చలు నిలిచినట్లు సమాచారం!

Sanju Samson-Jadeja : సంజూ శాంసన్-జడేజా ట్రేడ్ డీల్‌పై సస్పెన్స్‌.. చర్చలు నిలిచినట్లు సమాచారం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2025
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభానికి ముందే పలు ట్రేడ్‌ డీల్స్‌ సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా రాజస్థాన్‌ రాయల్స్‌(RR) కెప్టెన్‌ సంజు శాంసన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) జట్టుకు మారే అవకాశం ఉందన్న వార్త క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో సిఎస్‌కే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను ఇచ్చి సంజు శాంసన్‌ను తమ జట్టులోకి తెచ్చుకోవాలని చెన్నై యోచిస్తోందట. అయితే రాజస్థాన్‌ రాయల్స్‌ మాత్రం జడేజాతో పాటు సామ్‌ కరన్‌ను కూడా కావాలంటూ పట్టుబడుతోందని సమాచారం. ఈ ప్రతిపాదనపై ఇరు జట్లు చర్చలు ప్రారంభించినప్పటికీ, తాజాగా ఆ ట్రేడింగ్‌ చర్చలు నిలిచిపోయినట్లు క్రిక్‌బజ్‌ నివేదిక చెబుతోంది. కారణం- సామ్‌ కరన్‌ విషయంలో ఆర్ఆర్‌ ఫ్రాంచైజీకి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి.

Details

విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవాలి

ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ఒక్కో జట్టులో గరిష్టంగా ఎనిమిది విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవాలి. ప్రస్తుతం ఆర్ఆర్‌ జట్టులో జోఫ్రా ఆర్చర్‌, షిమ్రాన్‌ హెట్మేయర్‌, వనిందు హసరంగా, మహేశ్‌ తీక్షణ, ఫజల్హాక్‌ ఫరూకీ, క్వేనా మఫాకా, నాండ్రే బర్గర్‌, లుయాండ్రే ప్రిటోరియస్‌లు ఉన్నారు. దీంతో విదేశీ ఆటగాళ్ల కోటా పూర్తిగా నిండిపోయింది. ఈ సాంకేతిక సమస్యను ఎలాగో అధిగమించినా, మరో అడ్డంకి ఆర్ఆర్‌ బడ్జెట్‌ పరిమితి. ప్రస్తుతం ఆ జట్టు పర్స్‌ వాల్యూ కేవలం రూ.30 లక్షలే. కానీ సామ్‌ కరన్‌ను గత వేలంలో సీఎస్‌కే రూ.2.4 కోట్లకు కొనుగోలు చేసింది. కాబట్టి ఆర్ఆర్‌ జట్టుకు కరన్‌ను ట్రేడ్‌ చేసుకునే నిధులు లేవు.

Details

19 ఏళ్ల వయసులో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడిన అనుభవం

అయితే రాజస్థాన్‌ ఇంకా ఈ అవకాశాన్ని పూర్తిగా వదిలేయలేదు. సామ్‌ కరన్‌ను తమ జట్టులో చేర్చుకోవాలంటే ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఓ విదేశీ ఆటగాడిని వేలానికి విడుదల చేయాల్సి ఉంటుంది. దీంతో ఆర్ఆర్‌ విదేశీ ఆటగాళ్ల కోటాలో స్థానం ఖాళీ అవుతుంది, అలాగే ఆ ఆటగాడి ధర పర్స్‌ వాల్యూకు యాడ్‌ అవుతుంది. ఇప్పుడు ఆర్ఆర్‌ ఎవరిని విడుదల చేస్తుందో, ఎంత నిధి లభిస్తుందో అన్నదే ఈ ట్రేడ్‌ ఫలితాన్ని నిర్ణయించనుంది. జడేజా విషయానికి వస్తే — అతడు ఐపీఎల్‌ తొలి సీజన్‌లో 19 ఏళ్ల వయసులో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడాడు. ఆ సీజన్‌లో ఆర్ఆర్‌ జట్టు తొలి ఐపీఎల్‌ ట్రోఫీని గెలుచుకుంది.

Details

 2010లో ముంబై ఇండియన్స్‌తో నేరుగా ఒప్పందం 

రెండు సీజన్లు ఆర్ఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన జడేజా, 2010లో ముంబై ఇండియన్స్‌తో నేరుగా ఒప్పందం చేసుకోవాలనే ప్రయత్నం చేయడంతో ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. నిషేధం తర్వాత 2011లో కొచ్చి టస్కర్స్‌ కేరళ తరపున ఆడాడు. 2012లో సీఎస్‌కేలో చేరిన జడేజా, అప్పటి నుంచి జట్టుకు అవిభాజ్య భాగమయ్యాడు. సీఎస్‌కే సస్పెండ్‌ అయిన రెండేళ్లు మినహా, దాదాపు దశాబ్దంగా చెన్నైకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐదు ఐపీఎల్‌ టైటిల్స్‌లో మూడు గెలిచే విషయంలో అతడి పాత్ర కీలకం.