Loading...
Tanvi sharma: కొరియా మాస్టర్స్‌: తొలి మ్యాచ్‌లోనే శ్రీకాంత్‌కు నిరాశ.. రెండో రౌండ్‌కు తన్వి శర్మ
కొరియా మాస్టర్స్‌: తొలి మ్యాచ్‌లోనే శ్రీకాంత్‌కు నిరాశ.. రెండో రౌండ్‌కు తన్వి శర్మ

Tanvi sharma: కొరియా మాస్టర్స్‌: తొలి మ్యాచ్‌లోనే శ్రీకాంత్‌కు నిరాశ.. రెండో రౌండ్‌కు తన్వి శర్మ

వ్రాసిన వారు Moogati Shabari
Aug 06, 2026
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

కొరియా మాస్టర్స్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన శ్రీకాంత్‌, తొలి రౌండ్‌ను దాటలేక టోర్నీకి వీడ్కోలు పలికాడు. బుధవారం జరిగిన పోరులో ఇజ్రాయెల్‌కు చెందిన డానియిల్‌ డుబోవెంకో చేతిలో 20-22, 21-14, 12-21 గేమ్‌ల తేడాతో ఓటమి చవిచూశాడు. పురుషుల సింగిల్స్‌లో మరో భారత ఆటగాడు తరుణ్‌ మన్నెపల్లి కూడా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. కొరియాకు చెందిన తే బిన్‌తో జరిగిన పోరులో 13-21, 21-12, 19-21 స్కోరుతో పరాజయం పాలయ్యాడు.

వివరాలు

మహిళల సింగిల్స్‌లో తన్వి శుభారంభం..

ఇదే విభాగంలో కిరణ్‌ జార్జ్‌ 15-21, 9-21తో కొరియా షట్లర్‌ పార్క్‌ సాంగ్‌కు, మిథున్‌ మంజునాథ్‌ 11-21, 9-21తో చైనాకు చెందిన జు జుయాన్‌కు, రౌనక్‌ 21-23, 19-21తో కొరియా ఆటగాడు హియాక్‌ జిన్‌కు ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.

ఇటీవల తైపీ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న తన్వి శర్మ కొరియా మాస్టర్స్‌లోనూ విజయంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

తొలి రౌండ్‌లో చైనాకు చెందిన యువాన్‌ ఆన్‌ కిని 21-16, 21-15తో వరుస గేమ్‌లలో ఓడించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది.

వివరాలు

రక్షిత రామ్‌రాజ్‌ కూడా అద్భుత పోరాటం..

రక్షిత రామ్‌రాజ్‌ కూడా అద్భుత పోరాటంతో కొరియాకు చెందిన యూ యియాన్‌పై 22-24, 21-12, 21-13 స్కోరుతో విజయం సాధించింది.

ఐదో సీడ్‌ ఇషారాణి బారువా 21-18, 15-21, 21-7తో కొరియాకు చెందిన లీ సోను అధిగమించింది.

అన్మోల్‌ ఖర్బ్‌ 16-21, 21-17, 21-12తో హాంకాంగ్‌కు చెందిన సిన్‌ యాన్‌ను ఓడించింది.

అస్మిత చాలిహా 22-20, 21-18తో జపాన్‌ క్రీడాకారిణి రికో హిరమొటోపై గెలుపొందగా, శ్రియాంశి వలిశెట్టి 21-15, 21-14తో చైనీస్‌ తైపీకి చెందిన యు పోపై విజయం నమోదు చేసి తదుపరి రౌండ్‌కు చేరుకుంది.

ADVERTISEMENT

వివరాలు

డబుల్స్‌లో మిశ్రమ ఫలితాలు..

మహిళల డబుల్స్‌లో సోనాలి-రితిక జోడీ తొలి గేమ్‌ను కోల్పోయినప్పటికీ ఆ తర్వాత పుంజుకుని 13-21, 21-15, 21-12తో కొరియాకు చెందిన జి సున్‌-జి జాంగ్‌ ద్వయాన్ని ఓడించింది.

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఇషాన్‌-శ్రుతి జంట 20-22తో తొలి గేమ్‌ను చేజార్చుకున్నా, అనంతరం 21-10, 21-15తో వరుసగా రెండు గేమ్‌లు గెలిచి సాత్విక్‌ రెడ్డి-రాధిక శర్మ జోడీపై విజయం సాధించింది.

అయితే పురుషుల డబుల్స్‌లో భార్గవ్‌ రామ్‌-విశ్వ తేజ ద్వయం మాత్రం మలేసియాకు చెందిన ఆరోన్‌ చియా-ఆరోన్‌ తై జోడీకి 17-21, 15-21తో ఓటమి చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ADVERTISEMENT