Loading...
Tanvi Sharma: కొరియా మాస్టర్స్‌ లక్ష్యంగా తన్వి శర్మ.. తైపీ టైటిల్‌ జోష్‌తో మరో పోరు!
కొరియా మాస్టర్స్‌ లక్ష్యంగా తన్వి శర్మ.. తైపీ టైటిల్‌ జోష్‌తో మరో పోరు!

Tanvi Sharma: కొరియా మాస్టర్స్‌ లక్ష్యంగా తన్వి శర్మ.. తైపీ టైటిల్‌ జోష్‌తో మరో పోరు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

తైపీ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుని అద్భుత ఫామ్‌లో ఉన్న భారత యువ షట్లర్‌ 'తన్వి శర్మ' ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక సవాల్‌కు సిద్ధమైంది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న కొరియా మాస్టర్స్‌ సూపర్‌-300 బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో కూడా విజేతగా నిలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. కేవలం 17 ఏళ్ల వయసులోనే తన్వి తైపీ ఓపెన్‌లో అంచనాలకు మించి రాణించి అందరి ప్రశంసలు అందుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో వియత్నాంకు చెందిన లిన్‌ నుయెన్‌పై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి, తన కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో తైపీ ఓపెన్‌ గెలిచిన భారత్‌ తరఫున రెండో మహిళా షట్లర్‌గా తన్వి చరిత్ర సృష్టించింది.

వివరాలు

గతంలో సైనా నెహ్వాల్ పేరిట రికార్డు

అంతకుముందు 2008లో సైనా నెహ్వాల్‌ మాత్రమే ఈ ఘనత సాధించింది.

తైపీ విజయం తర్వాత కొరియా మాస్టర్స్‌లోనూ తన్విపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టోర్నీలో తొలి మ్యాచ్‌లో ఆమె ఓ క్వాలిఫయర్‌తో తలపడనుంది.

ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న తన్వి కొరియాలోనూ అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది.

మహిళల సింగిల్స్‌లో భారత్‌ నుంచి తన్వితో పాటు మాళవిక బాన్సోద్‌, అన్మోల్‌ ఖర్బ్‌, మాన్సి సింగ్‌, ఇషారాణి బారువా, తాన్య హేమంత్‌, ఆకర్షి కశ్యప్‌, శ్రియాంశి వలిశెట్టి, రక్షిత శ్రీ, అస్మిత చాలిహా కూడా బరిలో నిలవనున్నారు.

మహిళల డబుల్స్‌లో సోనాలి-రితాకా, ప్రియ-శ్రుతి జంటలు భారత ఆశలను మోస్తున్నాయి.

వివరాలు

బరిలో తెలుగు షట్లర్లు కూడా

కొరియా మాస్టర్స్‌లో పలువురు తెలుగు ఆటగాళ్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా కెనడా ఓపెన్‌కు దూరమైన కిదాంబి శ్రీకాంత్‌ ఇప్పుడు పూర్తిగా కోలుకుని బరిలోకి దిగుతున్నాడు.

మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ అయిన శ్రీకాంత్‌ తన తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన డానియిల్‌ డుబువెంకోతో తలపడనున్నాడు.

యువ షట్లర్‌ తరుణ్‌ మన్నెపల్లి కూడా పురుషుల సింగిల్స్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

పురుషుల డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్‌-పృథ్వీ కృష్ణమూర్తి, భార్గవ్‌ రామ్‌-విశ్వతేజ, అచ్యుతాదిత్యరావు-అర్జున్‌ రెడ్డి జోడీలు పోటీపడనున్నాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ రెడ్డి-రాధిక శర్మ ద్వయం భారత తరఫున బరిలోకి దిగనుంది.

ADVERTISEMENT