Loading...
India vs Sri Lanka: గాలెలో టీమిండియా జోరు.. శ్రీలంకపై భారీ ఆధిక్యం దిశగా
గాలెలో టీమిండియా జోరు.. శ్రీలంకపై భారీ ఆధిక్యం దిశగా

India vs Sri Lanka: గాలెలో టీమిండియా జోరు.. శ్రీలంకపై భారీ ఆధిక్యం దిశగా

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2026
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

వర్షం ప్రభావిత గాలె టెస్టులో భారత జట్టు పటిష్ఠ స్థితిలో కొనసాగుతోంది. శ్రీలంక స్పిన్నర్లు పుంజుకున్నప్పటికీ.. దేవ్‌దత్‌ పడిక్కల్‌తో పాటు ధ్రువ్‌ జురెల్‌ రాణించడంతో భారత్‌ ఆతిథ్య జట్టుకు గట్టి సవాల్‌ విసిరింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. కుల్‌దీప్‌ యాదవ్‌ 12 పరుగులతో, ప్రసిద్ధ్‌ కృష్ణ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. 288/2తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా మరో ఏడు వికెట్లు కోల్పోయి 172 పరుగులు జోడించింది. తొలి రోజు 131 పరుగులతో అజేయంగా నిలిచిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ తన స్కోరును 167 పరుగులకు చేర్చాడు.

వివరాలు

ప్రభాత్‌ జయసూర్యకి 4 వికెట్లు

230 బంతులు ఎదుర్కొన్న అతడు 15 ఫోర్లు, ఒక సిక్స్‌తో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

మరోవైపు వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ 68 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51 పరుగులు చేసి విలువైన అర్ధశతకం సాధించాడు.

శ్రీలంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య 4 వికెట్లు తీసుకోగా.. కెషార నువంత 3 వికెట్లు పడగొట్టాడు.

జయసూర్య 109 పరుగులు, నువంత 175 పరుగులు సమర్పించుకున్నారు.

వివరాలు

పంత్‌, రాహుల్‌ త్వరగానే ఔట్

వర్షం కారణంగా తొలి సెషన్‌ పూర్తిగా రద్దవడంతో ఆదివారం ఆట చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. ఆట మొదలైన వెంటనే భారత జట్టు వేగంగా పరుగులు చేయాలని ప్రయత్నించింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 27తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన రిషభ్‌ పంత్‌.. నువంత వేసిన ఎనిమిదో ఓవర్లోనే 39 పరుగుల వద్ద ఔటయ్యాడు.

ఎదుర్కొన్న తొలి బంతినే డీప్‌ మిడ్‌వికెట్‌లో బౌండరీకి తరలించిన పంత్‌.. భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో దినుషకు క్యాచ్‌ ఇచ్చాడు.

టెస్టుల్లో నువంతకు ఇదే తొలి వికెట్‌. తొలి రోజు 77 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన కేఎల్‌ రాహుల్‌ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చాడు.

అయితే మరో ఐదు పరుగులు మాత్రమే జోడించి నువంత బౌలింగ్‌లోనే పెవిలియన్‌ చేరాడు.

ADVERTISEMENT

వివరాలు

పడిక్కల్‌ భారీ శతకం

ఒకవైపు వికెట్లు పడుతున్నా పడిక్కల్‌ మాత్రం తన జోరును కొనసాగించాడు. ధ్రువ్‌ జురెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

215 బంతుల్లో 150 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అసిత బంతిని మిడ్‌వికెట్‌లో బౌండరీకి తరలించి ఈ ఘనత సాధించాడు.

అయితే టీ విరామానికి కొద్దిసేపు ముందు జయసూర్య బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.

ముందుకొచ్చి షాట్‌ ఆడే ప్రయత్నంలో అతడు బోల్తా పడ్డాడు. దీంతో జురెల్‌తో కలిసి ఐదో వికెట్‌కు నెలకొల్పిన 38 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ADVERTISEMENT

వివరాలు

జురెల్‌ బాధ్యతాయుత బ్యాటింగ్

రవీంద్ర జడేజా 13 పరుగులకే ఔటైనప్పటికీ.. జురెల్‌ మాత్రం బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేశాడు. మానవ్‌ సుతార్‌ 24 పరుగులతో అతడికి అండగా నిలిచాడు.

ఇద్దరూ కలిసి భారత్‌ స్కోరును 400 పరుగులు దాటించారు. నువంత బౌలింగ్‌లో జురెల్‌ డీప్‌ మిడ్‌వికెట్‌లో సిక్స్‌ బాదగా.. లహిరు కుమార ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. 66 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన జురెల్‌.. చివరకు జట్టు స్కోరు 432 పరుగుల వద్ద ఔటయ్యాడు.

సుతార్‌తో కలిసి ఏడో వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. ఆ తర్వాత సుతార్‌ 24, మహ్మద్‌ సిరాజ్‌ 11 పరుగులకు పెవిలియన్‌ చేరారు. కుల్‌దీప్‌, ప్రసిద్ధ్‌ కలిసి ఇన్నింగ్స్‌ను మూడో రోజుకు తీసుకెళ్లారు.

వివరాలు

వరుణుడి దెబ్బ.. రెండో రోజు 43 ఓవర్లే

గాలె టెస్టును వరుణుడు వెంటాడుతున్నాడు. తొలి రోజు 90 ఓవర్లకు గాను 77 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

రెండో రోజు పరిస్థితి మరింత దారుణంగా మారింది. వర్షం, చిత్తడి ఔట్‌ఫీల్డ్‌ కారణంగా సగం రోజు ఆట వృథా కాగా.. కేవలం 43 ఓవర్లే వేయగలిగారు.

తొలి సెషన్‌ పూర్తిగా రద్దవగా.. లంచ్‌ తర్వాత కూడా ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. వచ్చే రోజుల్లోనూ వర్షం ముప్పు ఉండే అవకాశం కనిపిస్తోంది.

దీంతో మ్యాచ్‌లో మరింత ఆట నష్టం జరిగే ప్రమాదం ఉంది.

ఈ పరిస్థితుల్లో విజయం సాధించాలంటే టీమ్‌ఇండియా అందుబాటులో ఉన్న సమయాన్ని సమర్థంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది.

వివరాలు

'నాపై ఎలాంటి ఒత్తిడి లేదు': జురెల్

తన గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో అర్ధశతకం సాధించకపోయినా.. ఆదివారం ఎలాంటి ఒత్తిడికి గురికాలేదని ధ్రువ్‌ జురెల్‌ చెప్పాడు.

కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని తెలిపాడు. 'నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు.

భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు కృతజ్ఞుడిగా ఉంటాను. కెప్టెన్‌, కోచ్‌తో మాట్లాడిన ప్రతిసారీ ఏం చేయాలో చెప్పేవారు. పరిస్థితిని వివరించేవారు.

దానికి తగ్గట్లుగా ఆడేవాణ్ని. బ్యాటింగ్‌కు ముందు వ్యక్తిగతంగా నాకెలాంటి లక్ష్యాలు లేవు. జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడానని రెండో రోజు ఆట అనంతరం జురెల్‌ వెల్లడించాడు.

వివరాలు

వర్షం కారణంగా చాలా సమయం వృథా అయ్యింది

ఈ టెస్టు సిరీస్‌కు ముందు ఇదే గాలె వేదికపై భారత్‌-ఎ తరఫున ఆడటం కూడా తనకు కలిసొచ్చిందని చెప్పాడు.

''మేం 10 రోజుల ముందే శ్రీలంకకు వచ్చాం. కొలంబోలో సాధన చేశాం. అంతకుముందు భారత్‌-ఎ తరఫున ఇక్కడ ఆడాను.

దాంతో నా బ్యాటింగ్‌ మెరుగుపడింది. వాతావరణానికి కూడా అలవాటు పడ్డాను. అది ఇప్పుడు ఉపయోగపడింది'' అని వివరించాడు.

వర్షం కారణంగా చాలా సమయం వృథా కావడంతో.. అందుబాటులో ఉన్న సమయంలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే ఉద్దేశంతోనే జట్టు దూకుడుగా ఆడిందని జురెల్‌ పేర్కొన్నాడు.

ADVERTISEMENT