Women's World Cup 2025 : ఫైనల్‌కు అడుగు దూరంలో టీమిండియా.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో ఢీ!
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల ప్రపంచకప్ 2025 కీలక పోరుకు చేరుకుంది. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లు పూర్తవడంతో సెమీఫైనల్స్‌లో తలపడే నాలుగు జట్లు ఖరారయ్యాయి. ఆదివారం రాత్రి భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో పాయింట్ల పట్టికలో స్పష్టత వచ్చింది. సెమీఫైనల్‌కు చేరిన జట్లు ఈ సీజన్‌లో మొత్తం 28 మ్యాచ్‌లు జరిగిన మహిళల ప్రపంచకప్‌లో ప్రతి జట్టు 7 మ్యాచ్‌లు ఆడింది. వాటి అనంతరం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు సెమీఫైనల్ బెర్త్ దక్కించుకున్నాయి. మరోవైపు పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల ప్రయాణం లీగ్ దశలోనే ముగిసింది.
Details
మొదటి సెమీఫైనల్ - ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా
మొదటి సెమీఫైనల్ అక్టోబర్ 29న గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఇంగ్లండ్ లీగ్ దశలో అద్భుత ఫామ్‌లో ఉంది. 7 మ్యాచ్‌లలో 5 గెలిచిన ఇంగ్లండ్ 11 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సౌతాఫ్రికా కూడా మంచి ఆటతీరుతో 5 విజయాలు సాధించి, 10 పాయింట్లతో టాప్ 4లో స్థానం సంపాదించింది. రెండు జట్లు సమాన బలంగా ఉన్నందున ఈ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
Details
రెండవ సెమీఫైనల్ - భారత్ vs ఆస్ట్రేలియా
అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్ అక్టోబర్ 30న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. టీమిండియా లీగ్ దశలో 7 మ్యాచ్‌లలో 3 విజయాలు సాధించింది, 3లో ఓడిపోయింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 7 పాయింట్లతో భారత్ సెమీఫైనల్ టికెట్ కైవసం చేసుకుంది. మరోవైపు ప్రస్తుత చాంపియన్ ఆస్ట్రేలియా అజేయంగా నిలిచింది. 7 మ్యాచ్‌లలో 6 గెలిచి, ఒకటి వర్షం కారణంగా రద్దవడంతో 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. లీగ్ దశలో భారత్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియాకు ఎదురుగా ఇప్పుడు టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది.
Details
ఫైనల్ వివరాలు
ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. సెమీఫైనల్ ఫలితాల ఆధారంగా టైటిల్ పోరు ఏ జట్ల మధ్యన జరగనుందో తేలుతుంది. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో మ్యాచ్‌లు వాయిదా పడకుండా ఉండేందుకు ఐసీసీ ప్రత్యేక రిజర్వ్ డేలను కేటాయించింది. సెమీఫైనల్ లేదా ఫైనల్ రోజున వర్షం అంతరాయం కలిగిస్తే, మరుసటి రోజు మ్యాచ్ కొనసాగుతుంది. మొత్తం మీద మహిళల ప్రపంచకప్ 2025 ఇప్పుడు నాకౌట్ దశలోకి ప్రవేశించడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ పీక్స్‌కి చేరుకుంది.