Yashasvi Jaiswal: టీమిండియా ఓపెనర్ జైస్వాల్ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
భారత టెస్ట్ జట్టు ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా తరఫున ప్రస్తుతం ఎటువంటి కమిట్‌మెంట్లు లేకపోవడంతో, దేశీయ క్రికెట్ ఆడేందుకు నిర్ణయించాడు. ఈ క్రమంలో రాబోయే రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ మూడో రౌండ్ మ్యాచ్‌లో పాల్గొనాలని నిర్ణయించి, తన హోం టీమ్ ముంబై మేనేజ్‌మెంట్‌కు లేఖ రాశాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌మీడియా ద్వారా స్వయంగా వెల్లడించాడు. ఇటీవల జైస్వాల్ తన హోం టీమ్ ముంబైని వదిలి గోవా తరఫున ఆడతానని ప్రకటించాడు. అయితే ఆ నిర్ణయం నుంచి యూటర్న్ తీసుకుంటూ, తాజాగా ముంబై తరఫునే ఆడేందుకు సిద్ధమని తెలిపాడు.
Details
రంజీ ట్రోఫీకి సిద్ధం
రాబోయే రంజీ ట్రోఫీ మూడో రౌండ్‌లో రాజస్థాన్‌తో జైపూర్‌లో నవంబర్ 1న ప్రారంభమయ్యే మ్యాచ్‌లో తాను అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. ఈ మ్యాచ్ ఎలైట్ గ్రూప్ Dలో భాగంగా జరుగనుంది. అయితే, ముంబై మేనేజ్‌మెంట్ గతంలో తనను వదిలిపెట్టాలని చూసిన జైస్వాల్‌కు ఇప్పుడు మళ్లీ అవకాశం ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అవకాశం లభిస్తే, అతను ముంబై జట్టుకు ముఖ్య బలం కానున్నాడు. జైస్వాల్ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే అక్టోబర్ 29 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపిక కాలేదు.
Details
సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు దేశీయ క్రికెట్ ఆడాలి
దాంతో దేశీయ క్రికెట్‌లో ఆడుతూ ఫామ్ నిలబెట్టుకోవాలని నిర్ణయించాడు. బీసీసీఐ నియమాల ప్రకారం, టీమిండియా తరఫున ప్రస్తుతం ఎటువంటి కమిట్‌మెంట్ లేని సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు తప్పనిసరిగా దేశీయ క్రికెట్ ఆడాలనే నిబంధన ఉంది. ఆ మేరకు జైస్వాల్ కూడా రంజీ ట్రోఫీలో పాల్గొనాలని నిర్ణయించాడు. మూడో రౌండ్‌కు సంబంధించిన ముంబై జట్టు జాబితా త్వరలో విడుదల కానుంది. గత సీజన్‌లో జైస్వాల్ చివరిసారిగా జమ్మూ అండ్ కాశ్మీర్‌తో ముంబై తరఫున ఆడాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా పాల్గొన్నాడు.
Details
దక్షిణాఫ్రికాతో టెస్టులు మ్యాచులు
తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను ఈ ఏడాది ఆగస్ట్‌లో దులీప్ ట్రోఫీ 2025లో వెస్ట్ జోన్ తరఫున ఆడాడు. రంజీ ట్రోఫీలో ఆడటం జైస్వాల్‌కు వ్యక్తిగతంగా కూడా మంచి అవకాశంగా మారనుంది. నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ అవుతుంది. ఆ సిరీస్‌లో భారత్ రెండు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. టెస్ట్ జట్టులో జైస్వాల్ స్థానం దాదాపు ఖాయం కాగా, వన్డే, టీ20ల్లో అవకాశం దక్కుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. దక్షిణాఫ్రికాతో టెస్టులు నవంబర్ 14 (కోల్‌కతా), నవంబర్ 22 (గౌహతి) తేదీల్లో జరగనున్నాయి.