Womens World Cup Trophy : టీమిండియాకు అందింది డమ్మీ ట్రోఫీయే.. అసలైన ప్రపంచకప్ ఐసీసీ వద్దే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ చారిత్రక విజయంతో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లకు మెరిసే ప్రపంచకప్ ట్రోఫీని బహూకరించారు. అయితే అభిమానులకు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారత జట్టుకు అందించిన ఆ అసలైన ట్రోఫీ కొద్దిసేపటికే తిరిగి తీసుకుంటారు. దీనికి కారణం ఐసీసీ నిబంధనలే. ఐసీసీ నిబంధనల ప్రకారం, ఏ జట్టైనా ఐసీసీ టోర్నమెంట్ గెలిచినా వారికి అసలైన ట్రోఫీని శాశ్వతంగా ఇవ్వరు. బహుమతి ప్రదానోత్సవం, ఫోటో సెషన్ అనంతరం ఆ ట్రోఫీని మళ్లీ ఐసీసీకి అప్పగించాలి.
Details
వెండితో తయారు చేసి ప్రత్యేకంగా అలంకరణ
దాని బదులుగా విజేత జట్టుకు 'డమ్మీ ట్రోఫీ'ని ఇస్తారు. ఈ డమ్మీ కూడా అసలైనదిలా ఉండేలా బంగారం, వెండి ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేస్తారు. 26 సంవత్సరాల క్రితమే ఐసీసీ ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది. అసలైన ట్రోఫీ దొంగతనానికి గురికాకుండా, లేదా పాడవకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నారు. ఆ అసలైన ట్రోఫీని దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో భద్రపరుస్తారు. భారత మహిళల జట్టు అందుకున్న ప్రపంచకప్ ట్రోఫీ రూపకల్పన కూడా విశేషమే. మహిళల ప్రపంచకప్ 2025 ట్రోఫీ బరువు 11 కిలోలు, ఎత్తు దాదాపు 60 సెంటీమీటర్లు ఉంటుంది. దీన్ని వెండి, బంగారంతో రూపొందించారు.
Details
ఫైనల్‌లో అద్భుతంగా రాణించిన భారత జట్టు
మూడు వెండి స్తంభాలు స్టంప్స్, బెయిల్స్ ఆకారంలో ఉంటాయి. వాటి పైభాగంలో బంగారంతో తయారైన గ్లోబ్ (గోళం) ఉంటుంది. ఈ ట్రోఫీపై ఇప్పటివరకు ప్రపంచకప్ గెలిచిన జట్ల పేర్లు చెక్కబడి ఉన్నాయి. తాజాగా మొదటిసారిగా భారత్ పేరు కూడా అందులో చోటు చేసుకుంది. ఇప్పటి వరకు జరిగిన 13 మహిళల ప్రపంచకప్ టోర్నమెంట్‌లలో ఆస్ట్రేలియా 7 సార్లు, ఇంగ్లాండ్ 4 సార్లు, న్యూజిలాండ్ ఒకసారి, భారత్ ఒకసారి టైటిల్ గెలుచుకున్నాయి. ఫైనల్‌లో భారత జట్టు అద్భుతంగా రాణించింది.
Details
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా షఫాలీ వర్మ
నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 298 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు 246 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ 87 పరుగులతో పాటు రెండు వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచింది. దీప్తి శర్మ 58 పరుగులతో పాటు 5 కీలక వికెట్లు తీశి విజయానికి కీలకంగా మారింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వాల్వార్ట్ 101 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయింది. ఈ విజయం భారత మహిళల క్రికెట్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోయింది.