World Rapid ChampionShip: ప్రపంచ చెస్‌లో తెలుగు వెలుగులు.. హంపి, అర్జున్‌కి కాంస్య పతకాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు తేజాలు కోనేరు హంపి, అర్జున్ ఇరిగేశి సత్తా చాటారు. స్థిరమైన, పోరాటపూరిత ఆటతో ఇద్దరూ కాంస్య పతకాలు సాధించి ప్రపంచ చెస్‌లో మరోసారి తెలుగు ప్రతిభను చాటిచెప్పారు. 38 ఏళ్ల హంపి ర్యాపిడ్ ఫార్మాట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మరో పతకాన్ని ఖాతాలో వేసుకోగా, అర్జున్ ఇరిగేశికి ఇది ప్రపంచ చెస్ టోర్నీలో తొలి పతకంగా నిలిచింది. మహిళల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన కోనేరు హంపి టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు చివరి రౌండ్ వరకు ఉత్కంఠభరితంగా పోరాడింది. మొత్తం 11 రౌండ్లలో అజేయంగా కొనసాగిన హంపి 8.5 పాయింట్లు సాధించి జు జినెర్ (చైనా), అలెగ్జాండ్రా గొర్యాచ్‌కినా (రష్యా)తో కలిసి సమానంగా అగ్రస్థానంలో నిలిచింది.
Details
అలెగ్జాండ్రా గొర్యాచ్‌కినాకి స్వర్ణం
పదకొండో గేమ్‌లో గొర్యాచ్‌కినా-జినెర్ డ్రా చేసుకోవడంతో చివరి గేమ్‌లో విజయం సాధిస్తే హంపికే టైటిల్ దక్కే అవకాశం ఏర్పడింది. అయితే సవితతో ఆమె గేమ్ డ్రా కావడంతో ముగ్గురూ సమాన పాయింట్లతో నిలిచారు. టైబ్రేక్ స్కోరు కారణంగా హంపి మూడో స్థానానికి పరిమితమై కాంస్య పతకాన్ని అందుకుంది. అలెగ్జాండ్రా గొర్యాచ్‌కినా స్వర్ణం, జు జినెర్ రజతం సాధించారు. భారత మహిళా క్రీడాకారుల్లో సవిత (8 పాయింట్లు) నాలుగో స్థానం, వైశాలి (8) ఐదో స్థానం, దివ్య ఎనిమిదో స్థానం, హారిక (7) 19వ స్థానంలో నిలిచారు. ఓపెన్ విభాగంలో అర్జున్ ఇరిగేశి అద్భుత ప్రదర్శన కనబరిచి కాంస్య పతకం గెలుచుకున్నాడు. 13 రౌండ్లలో 9.5 పాయింట్లు సాధించిన అర్జున్ మూడో స్థానంలో నిలిచాడు.
Details
ప్రపంచ చెస్ టోర్నీలో అర్జున్‌కు ఇది తొలి పతకం
అర్జున్‌తో పాటు వ్లాదిస్లావ్ (రష్యా), నీమన్ (జర్మనీ), పెరీజ్ (అమెరికా) కూడా 9.5 పాయింట్లే సాధించినా, టైబ్రేక్ స్కోరులో వ్లాదిస్లావ్‌కు రజతం, అర్జున్‌కు కాంస్యం దక్కింది. ప్రపంచ చెస్ టోర్నీలో అర్జున్‌కు ఇది తొలి పతకం కావడం విశేషం. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) మరోసారి తన సత్తా నిరూపించాడు. 10.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఆరోసారి ప్రపంచ ర్యాపిడ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. గతంలో 2014, 2015, 2019, 2022, 2023లోనూ కార్ల్‌సన్ విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో ఏడో రౌండ్‌లో వ్లాదిస్లావ్ చేతిలో ఓటమి ఎదురైనా, ఆఖరి రోజు వరుసగా మూడు రౌండ్లలో గెలిచి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు.
Details
ఇక హంపి ర్యాపిడ్ చెస్‌లో సాధించిన పతకాల విషయానికి వస్తే
ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్ 8.5 పాయింట్లతో 20వ స్థానంలో, ప్రజ్ఞానంద కూడా 8.5 పాయింట్లతో 27వ స్థానంలో నిలిచారు. సోమవారం నుంచి ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం కానుంది. స్వర్ణం: 2019, 2024 రజతం: 2023 కాంస్యం: 2012, 2025 ప్రపంచ ర్యాపిడ్ చెస్‌లో మొత్తం అయిదు పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా కోనేరు హంపి అరుదైన రికార్డు నెలకొల్పడం విశేషం.