Satadru Dutta: కోల్‌కతా స్టేడియంలో ఉద్రిక్తతలు.. మెస్సి ఈవెంట్ నిర్వాహకుడికి నో బెయిల్
ఈ వార్తాకథనం ఏంటి
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ పర్యటన సందర్భంగా కోల్‌కతాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు తీవ్ర రాజకీయ, న్యాయ పరిణామాలకు దారి తీశాయి. ఈ ఘటనలో అరెస్టయిన ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాకు బెయిల్ లభించలేదు. అతడిని కోర్టు 14 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా మెస్సి తొలిసారిగా కోల్‌కతా చేరుకున్నాడు. ఈ సందర్భంగా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే ముందుగా ప్రకటించిన సమయంతో పోలిస్తే మెస్సి చాలా తక్కువసేపు స్టేడియంలో గడపడంతో అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఆగ్రహంతో కొందరు అభిమానులు మైదానంలోకి సీసాలు, ప్లాస్టిక్ కుర్చీలను విసిరేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Details
14 రోజుల కస్టడీకి అనుమతి
ఈ ఘటనకు సంబంధించి ఈవెంట్‌ను సరిగా నిర్వహించకపోవడమే గందరగోళానికి కారణమన్న ఆరోపణలతో శతద్రు దత్తాను పోలీసులు ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం అతడిని బిధాన్నగర్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం బెయిల్‌కు నిరాకరిస్తూ 14 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈవెంట్ ప్రణాళిక, అనుమతులు, భద్రతా ఏర్పాట్లు, కార్యచరణ నిర్ణయాలపై పోలీసులు అతడిని విచారించనున్నారు. కోర్టుకు తీసుకొచ్చే సమయంలో భాజపా నేతలు నినాదాలు చేయడం రాజకీయ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది. ఇక ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం కొనసాగుతోంది. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతల కారణాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.