IND vs SA: నాయకులకు పరీక్ష.. మూడో టీ20లో సూర్య-గిల్‌పై ఒత్తిడి!
ఈ వార్తాకథనం ఏంటి
టెస్టులు, వన్డేల్లో కెప్టెన్‌గా, టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శుభమన్ గిల్ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ కూడా ఎప్పుడెప్పుడు పెద్ద ఇన్నింగ్స్ ఆడాడో గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ, కెప్టెన్ ఇలాంటి ఫామ్‌లో ఉండటం జట్టుకు ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో గిల్, సూర్య ఇద్దరూ లయ అందుకోవడం, భారత్ విజయం సాధించడం అత్యంత కీలకంగా మారింది. దక్షిణాఫ్రికాతో అయిదు టీ20ల సిరీస్‌ను ఘనవిజయంతో ఆరంభించిన టీమిండియా, రెండో మ్యాచ్‌లో చతికిలపడింది. ఇప్పుడు కీలకమైన మూడో టీ20కు సిద్ధమవుతోంది.
Details
ఇవాళ ధర్మశాలలో మ్యాచ్
ఆదివారం ధర్మశాలలో ఈ మ్యాచ్ జరగనుంది. కెప్టెన్ సూర్యకుమార్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ల ఫామ్ భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఈ సిరీస్‌లో గిల్ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతే జట్టులో అతడి స్థానం గల్లంతయ్యే ప్రమాదం ఉంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో వరుస ప్రయోగాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జట్టు యాజమాన్యం.. ఈ మ్యాచ్‌లో ఎవరిని ఏ స్థానంలో ఆడిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. బారాబటిలో ఘోర పరాభవం తర్వాత చండీగఢ్‌లో గట్టిగా పుంజుకున్న దక్షిణాఫ్రికా జట్టు.. ధర్మశాలలో మరో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది
Details
జోరు మీద సఫారీలు
మొదటి టీ20లో కేవలం 74 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా.. రెండో మ్యాచ్‌లో ఏకంగా 213 పరుగులు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఇక ఆ జట్టును భారత్ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. డికాక్ ఫామ్‌లోకి వస్తే ఎంత ప్రమాదకరమో చివరి వన్డేలో, రెండో టీ20లో భారత్ ఇప్పటికే అనుభవించింది. రెండో టీ20లో మార్‌క్రమ్, డొనోవన్ ఫెరీరా కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. హెండ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్‌లతో కలిపి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. చండీగఢ్‌లో సఫారీ బౌలర్లు కూడా అదరగొట్టారు. పేసర్లు బార్ట్‌మన్, ఎంగిడి, యాన్సెన్ కలిసి ఎనిమిది వికెట్లు తీశారు. ధర్మశాలలో పరిస్థితులు కూడా పేసర్లకు అనుకూలంగా ఉండటంతో భారత బ్యాటర్లు అప్రమత్తంగా ఆడాల్సిన అవసరం ఉంది.
Details
ఎవరెక్కడ?
గత మ్యాచ్‌లో బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను మూడో స్థానంలో ఆడించి, విధ్వంసక బ్యాటర్ శివమ్ దూబెను ఎనిమిదో స్థానానికి పరిమితం చేయడం జట్టు యాజమాన్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. అక్షర్ 21 బంతుల్లో 21 పరుగులే చేసి ఔటవ్వగా, దూబె 18వ ఓవర్ చివరి బంతికి క్రీజులోకి వచ్చాడు. అప్పటికే భారత్ ఓటమి ఖరారైపోయింది. 214 పరుగుల భారీ ఛేదనలో ఈ వ్యూహం ఏమిటో అర్థం కాక అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో అయినా బ్యాటింగ్ ఆర్డర్‌ను సరిచేస్తారా అన్నది చూడాలి. టాప్ ఆర్డర్‌లో గిల్, సూర్య పేలవ ప్రదర్శన జట్టుకు తీవ్రంగా నష్టపరుస్తోంది.
Details
రెండో మ్యాచులో గిల్ డకౌట్
తొలి టీ20లో గిల్ నాలుగు పరుగులకే పరిమితమయ్యాడు. రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్‌లను పక్కన పెట్టి గిల్‌కే అవకాశాలు ఇవ్వడంపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఆదివారం కూడా గిల్ విఫలమైతే అతడిపై వేటు తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సూర్యకుమార్ కూడా త్వరగా పేలవ ఫామ్ నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో అతడు 12, 5 పరుగులే చేశాడు. అభిషేక్ శర్మ ఇప్పటివరకు తనదైన శైలిలో చెలరేగలేకపోయాడు.
Details
మెరుగైన ప్రదర్శన చేస్తున్న స్పిన్నర్లు
ధర్మశాలలో అయినా బ్యాటు ఝళిపిస్తాడేమో చూడాలి. తిలక్ వర్మ రెండో టీ20లో చక్కటి ఇన్నింగ్స్ ఆడగా, హార్దిక్ పాండ్యా కూడా లయలో కనిపిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో తొలి టీ20లో సమష్టిగా రాణించిన భారత బౌలర్లు రెండో మ్యాచ్‌లో మాత్రం తేలిపోయారు. అర్ష్‌దీప్, బుమ్రా వికెట్ తీయలేకపోయినప్పటికీ భారీగా పరుగులు ఇచ్చారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ మాత్రం మెరుగైన ప్రదర్శన చేశారు. ఒక పేసర్‌ను తగ్గించి, ధర్మశాలలో మంచి రికార్డు ఉన్న కుల్‌దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.