వరల్డ్ కప్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ కెప్టెన్
బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్‌కు మరో మూడు నెలల సమయం ఉన్న తరుణంలో అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తన నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తేవాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కోరాడు. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ మేనేజ్‌మెంట్ షాక్‌కు గురైంది. తమీమ్ ఇలా రిటైర్మెంట్ ప్రకటించడంతో పలువురు క్రికెట్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిన్న స్వదేశంలో ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచులో ఆడిన తమీమ్ తన సన్నిహితులకు కూడా సమాచారం ఇవ్వకుండా రిటైర్మెంట్ ప్రకటన చేసినట్లు సమాచారం.
ఎమోషనల్ అయిన తమీమ్ ఇక్బాల్
ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు సొంతగడ్డపై ఆప్ఘనిస్తాన్‌తో మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడుతోంది. అయితే తొలి వన్డేలో బంగ్లాదేశ్ 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బంగ్లాదేశ్ ఒదిన వెంటనే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. ఇక్బాల్ 2007లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకూ అంతర్జాతీయ క్రికెట్‌లో 70 టెస్టులు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. వన్డేల్లో 14 సెంచరీలు, టెస్టులు 10 సెంచరీలు, టీ20ల్లో ఒక సెంచరీ బాదాడు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తమీమ్ ఇక్బాల్ ఎమోషనల్ అయ్యాడు. ఇప్పటివరకూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని, తనకు అండగా నిలిచి బీసీబీ అధికారులకు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశాడు.