ICC ODI Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన భారత ఆటగాళ్లు.. టాప్-10లో ముగ్గురు!
శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో టీమిండియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో అకట్టుకుంటున్నారు. దీంతో తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే బ్యాటర్ల జాబితాలో టాప్-10లో ముగ్గురు ఆటగాళ్లు చోటు సంపాదించుకున్నారు. ఈ ర్యాకింగ్స్ లో భారత యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ తన కెరీర్ లోనే అత్యుత్తమంగా రెండో స్థానానికి ఎగబాకాడు. నేపాల్, పాకిస్థాన్ పై హాఫ్ సెంచరీలు సాధించిన గిల్ వన్డే ర్యాంకింగ్స్ లో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి వచ్చాడు. ఇక పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గతేడాది టాప్ 10 కనిపించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చెరో రెండు స్థానాలు ఎగబాకి వరుసగా 8, 9వ స్థానాల్లో నిలిచారు.
బౌలర్ల ర్యాంకింగ్స్ లో 7వ స్థానానికి ఎగబాకిన కుల్దీప్ యాదవ్
భారత క్రికెట్ జట్టు నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారిగా టాప్ 10లో ముగ్గురు ఆటగాళ్లకు స్థానం లభించింది. 2019లో చివరిగా ముగ్గురు భారత బ్యాటర్లు టాప్-10లో కొనసాగారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బౌలర్ల విషయానికొస్తే 692 పాయింట్లతో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ స్పీడ్‌స్టర్ ట్రెంట్ బౌల్ట్, మిచెల్ స్టార్క్ 666 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. శ్రీలంకపై నాలుగు వికెట్లతో చెలరేగిన కుల్దీప్ యాదవ్ 7వ స్థానంలో నిలిచాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా 27వ స్థానంలో ఉన్నాడు.