No Handshake Policy : అండర్-19 ఆసియా కప్‌లోనూ కొనసాగిన నో షేక్ హ్యాండ్.. భారత్-పాక్ మ్యాచ్‌లో సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఇటీవల ముగిసిన సీనియర్ ఆసియా కప్‌లో అనుసరించినట్లుగానే ఈ టోర్నీలోనూ టీమ్ఇండియా 'నో షేక్ హ్యాండ్స్' విధానాన్ని కొనసాగించింది. అయితే భారత ఆటగాళ్లు పాక్ క్రికెటర్లతో కరచాలనం చేసేలా చూడాలని ఐసీసీ (ICC), బీసీసీఐ (BCCI)ను అభ్యర్థించినట్లు సమాచారం. అయినప్పటికీ తుది నిర్ణయాన్ని బీసీసీఐకే వదిలేసినట్లు తెలుస్తోంది. దాంతో టాస్ సమయంలో భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే, పాకిస్థాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్‌తో కరచాలనం చేయలేదు. వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యమైంది. మ్యాచ్ కూడా ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఇరు జట్ల ఇన్నింగ్స్‌ల నుంచి ఒక్కో ఓవర్‌ను తగ్గించారు.
Details
బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో మెరిసిన వైభవ్ సూర్యవంశీ ఈసారి విఫలమయ్యాడు. మహ్మద్ సయ్యమ్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి 5 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో టీమ్ఇండియా 29 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రే (38), విహాన్ మల్హోత్రా (12) కూడా వరుసగా ఔటయ్యారు. 23 ఓవర్ల ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజులో అరోజ్ జార్జి 51 పరుగులతో నిలకడగా ఉండగా, కుందు 5 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ సయ్యమ్, నికబ్ షఫిక్ చెరో రెండు వికెట్లు సాధించారు.
Details
నో షేక్ హ్యాండ్ నిర్ణయానికి కారణం ఇదే
పుల్వామాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత ప్రభుత్వం 'ఆపరేషన్ సిందూర్' నిర్వహించి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత కూడా పాకిస్థాన్ భారత్‌పై దాడులకు ప్రయత్నించగా, వాటిని భారత భద్రతా బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌తో మ్యాచ్‌ల సమయంలో భారత ఆటగాళ్లు కరచాలనం చేయకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.