Loading...
IND vs SL: జడ్డూ స్థానానికి పర్ఫెక్ట్‌ ఛాయిస్‌.. సుతార్‌ సూపర్‌ స్పిన్‌ షో!
జడ్డూ స్థానానికి పర్ఫెక్ట్‌ ఛాయిస్‌.. సుతార్‌ సూపర్‌ స్పిన్‌ షో!

IND vs SL: జడ్డూ స్థానానికి పర్ఫెక్ట్‌ ఛాయిస్‌.. సుతార్‌ సూపర్‌ స్పిన్‌ షో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2026
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్‌లో రవీంద్ర జడేజాకు వారసుడు దొరికాడా? శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే మానవ్‌ సుతార్‌ చూపించిన ప్రతిభ చూస్తే ఈ ప్రశ్న రావడం సహజమే. ఇది అతడికి కేవలం రెండో టెస్టు మాత్రమే కావడంతో ఇంత తొందరగా ఓ నిర్ణయానికి రావడం సరికాదనిపించొచ్చు. కానీ ప్రతిభ ఉన్న ఆటగాడిని గుర్తించడానికి ఎక్కువ సమయం అవసరం లేదనే మాట కూడా నిజమే. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణిస్తున్న ఈ యువ స్పిన్‌ ఆల్‌రౌండర్‌.. జడేజాకు సరైన ప్రత్యామ్నాయంగా ఎదగగలడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. శ్రీలంకతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మానవ్‌ సుతార్‌ వేసిన మొదటి బంతికే వికెట్‌ దక్కింది.

వివరాలు

లోయర్‌ ఆర్డర్‌లో కీలక పరుగులు

ఆ వికెట్‌తోనే తన సత్తా ఏంటో చాటిన అతడు.. ఆ తర్వాత కూడా లంక బ్యాటర్లను కుదురుకోనీయలేదు.

మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టి భారత జట్టు భారీ ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు బ్యాటింగ్‌లోనూ విలువైన 24 పరుగులు చేశాడు.

43 బంతులు ఎదుర్కొన్న సుతార్‌.. లోయర్‌ ఆర్డర్‌లో కీలక పరుగులు జోడించాడు. అంతకుముందు జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లోనూ బ్యాట్‌తో పరుగులు సాధించాడు.

వివరాలు

నాణ్యమైన స్పిన్నర్

ఈ ప్రదర్శనతో జడేజా తరహాలో మరో నాణ్యమైన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ భారత జట్టుకు లభించాడంటూ ప్రశంసలు వస్తున్నాయి.

ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన జడేజా.. టెస్టులు, వన్డేల్లో కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో ఉన్న జడేజా మరో రెండు, మూడేళ్ల వరకు మాత్రమే టెస్టుల్లో కొనసాగగలడనే అంచనాలు ఉన్నాయి.

అందుకే భవిష్యత్‌లో అతడి స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం సుతార్‌లో ఉందని మాజీలు భావిస్తున్నారు.

అతడి నైపుణ్యాలకు మరింత పదును పెడితే సుతార్‌ మరింత మెరుగైన ఆటగాడిగా ఎదిగే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు

అదే సుతార్‌ బలం

ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో స్పిన్‌ను ఎదుర్కోవడంలో బ్యాటర్లు బాగా రాటుదేలారు. అలాంటి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలంటే బౌలర్‌కు ప్రత్యేకమైన శైలి ఉండాలి. సుతార్‌లో అదే ప్రత్యేకత కనిపిస్తోంది.

అతడు ఫ్లైటెడ్‌ డెలివరీలతో బ్యాటర్లను అయోమయానికి గురిచేస్తాడు. బంతిని ఆడాలా, వదిలేయాలా అనే సందేహంలో పడేలా చేస్తాడు.

శ్రీలంకతో తొలి టెస్టులో తన మొదటి బంతికే వికెట్‌ సాధించడం ఇందుకు మంచి ఉదాహరణ. చండిమాల్‌ డిఫెన్స్‌ ఆడేందుకు సిద్ధమయ్యేలోపే బంతి అతడి గ్లౌవ్స్‌ను తాకి కీపర్‌ చేతుల్లోకి వెళ్లింది.

రెండో టెస్టు మాత్రమే ఆడుతున్నప్పటికీ సుతార్‌ ఎంతో ఓపికగా బౌలింగ్‌ చేస్తూ లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడి ఉంటాడనే పేరు తెచ్చుకున్నాడు. బంతిని డ్రిఫ్ట్‌ చేయడంలోనూ అతడు నైపుణ్యం చూపిస్తాడు.

ADVERTISEMENT

వివరాలు

దేశవాళీల్లోనూ సత్తా

డ్రిఫ్ట్‌తో పాటు టర్న్‌ సాధించే బంతులను అంచనా వేయడం బ్యాటర్లకు చాలా కష్టం.

ఎడమచేతి వాటం కావడం కూడా సుతార్‌కు అదనపు ప్రయోజనం. టర్న్‌, డ్రిఫ్ట్‌ కలగలిపి బౌలింగ్‌ చేయగల ఈ యువ స్పిన్నర్‌.. ఇప్పటికే తన ప్రత్యేకతను చాటుతున్నాడు.

సుతార్‌ను కేవలం బౌలర్‌గా చూడలేం. ఆల్‌రౌండర్‌గా బ్యాట్‌తోనూ అతడు పరుగులు చేయగలడు. 2022లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన సుతార్‌.. తొలి సీజన్‌లోనే కేవలం ఆరు మ్యాచ్‌ల్లో 39 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

పుదుచ్చేరిపై 8/33తో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన నమోదు చేశాడు. బ్యాటింగ్‌లోనూ అతడికి మంచి అనుభవం ఉంది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటికే 120 పరుగులతో సెంచరీ సాధించాడు.

వివరాలు

తండ్రి త్యాగం.. కుమారుడి ఎదుగుదల

అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సుతార్‌.. ఆ మ్యాచ్‌లోనే 6/33తో ఫైఫర్‌ సాధించాడు. మొత్తంగా ఏడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన మానవ్‌ సుతార్‌ 2002 ఆగస్టు 3న జన్మించాడు. అతడి తండ్రి జగదీశ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌. చిన్నప్పటి నుంచే జగదీశ్‌కు క్రికెటర్‌ కావాలనే కల ఉండేది.

అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ కలను నెరవేర్చుకోలేకపోయారు. తన ఆశయాన్ని కుమారుడి ద్వారా సాధించాలనే ఉద్దేశంతో మానవ్‌ను క్రికెట్‌లోకి తీసుకొచ్చారు.

మానవ్‌ చిన్నతనంలో వారు నివసించే ప్రాంతంలో టర్ఫ్‌ పిచ్‌ సౌకర్యం ఉండేది కాదు. దీంతో బ్యాంకులో రుణం తీసుకుని మరీ ఇంటికి సమీపంలో టర్ఫ్‌ పిచ్‌ను ఏర్పాటు చేయించారు.

వివరాలు

గొప్ప బ్యాటర్ గా ఎదగాలి

కేవలం 11 ఏళ్ల వయసులోనే మానవ్‌ను క్రికెట్‌ అకాడమీలో చేర్పించారు. తన కుమారుడు గొప్ప బ్యాటర్‌గా ఎదగాలని జగదీశ్‌ కోరుకున్నారు.

అయితే కోచ్‌ సూచనతో మానవ్‌ స్పిన్‌ బౌలింగ్‌ను ఎంచుకున్నాడు. ఇప్పుడు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నాడు.

ఇదే స్థాయిలో అతడు ముందుకు సాగితే భారత జట్టుకు రవీంద్ర జడేజా తరహాలో నమ్మదగిన స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT