Ravichandran Ashwin: గిల్ ఫామ్‌పైనే అసలు ఆందోళన.. శుభ్‌మన్ గిల్‌పై అశ్విన్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో గిల్ నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన రాలేదు. ఈ నేపథ్యంలో అతడి వైస్ కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానంపై కూడా ప్రభావం పడుతుందన్న చర్చ మొదలైంది. గిల్‌ను జట్టు నుంచి తప్పిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్న వేళ, ఈ అంశంపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) స్పందించాడు. తన యూట్యూబ్ ఛానల్ 'యాష్ కి బాత్'లో మాట్లాడిన అశ్విన్, గిల్‌ను మధ్య సిరీస్‌లో తప్పించడం అంత సులభం కాదని స్పష్టం చేశాడు.
Details
గిల్‌కు తగిన అవకాశాలు ఇవ్వాలి
"శుభ్‌మన్ గిల్ కేవలం టీమిండియా ఓపెనర్ మాత్రమే కాదు, వైస్ కెప్టెన్ కూడా. ఒక వైస్ కెప్టెన్‌ను జట్టు నుంచి తొలగించడం చాలా కఠినమైన నిర్ణయం అవుతుంది. సిరీస్ మధ్యలో గిల్‌ను తప్పించి సంజు శాంసన్‌ను తీసుకురావడం సరైన చర్య కాదు. అలా చేస్తే ఆటగాడినే కాదు, వైస్ కెప్టెన్‌నూ తొలగించినట్లే అవుతుందని అశ్విన్ వ్యాఖ్యానించాడు. వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసిన తర్వాత గిల్‌కు తగిన అవకాశాలు ఇవ్వాల్సిందేనని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్‌కు అన్ని అవకాశాలు ఇవ్వాలి. అప్పటికీ అతడి నుంచి సరైన ప్రదర్శన రాకపోతే అప్పుడు వైస్ కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాడు.
Details
ప్రపంచ కప్ కు రెండు నెలలే సమయం
అదే సమయంలో వచ్చే ఏడాది జరగనున్న టీ20ప్రపంచకప్‌కు సంబంధించి జట్టు కూర్పుపై కూడా అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌కు ఇంకా రెండు నెలల సమయమే ఉండగా, ఇప్పటికీ భారత జట్టు తమ ఉత్తమ తుది జట్టును ఖరారు చేయకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నాడు. అయితే బౌలింగ్ విభాగంలో మాత్రం ఎలాంటి సందేహాలు లేవని, ఆ విభాగం బలంగా ఉందని చెప్పాడు. బౌలింగ్ పరంగా ఎలాంటి అనుమానాలు లేవు. హర్షిత్ రాణా అద్భుతంగా ఆడుతున్నాడు. అసలు చర్చ అంతా శుభ్‌మన్ గిల్ గురించే. అతడు పరుగులు చేయకపోతే జట్టులో కొనసాగుతాడా? అతడి స్థానంలో సంజు శాంసన్‌కు అవకాశం ఇస్తారా? అన్నదే ప్రశ్న. గిల్ తన స్థానాన్ని కాపాడుకోవాలంటే తగిన ప్రదర్శన చేయాల్సిందేనని పేర్కొన్నారు.