Loading...
IND vs WI: అసలు పరీక్ష ఇప్పుడు.. వెస్టిండీస్‌తో టీ20 సమరానికి భారత్‌ రెడీ
అసలు పరీక్ష ఇప్పుడు.. వెస్టిండీస్‌తో టీ20 సమరానికి భారత్‌ రెడీ

IND vs WI: అసలు పరీక్ష ఇప్పుడు.. వెస్టిండీస్‌తో టీ20 సమరానికి భారత్‌ రెడీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2026
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా ఆరంభంలో కొన్ని ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న శ్రేయస్‌ అయ్యర్‌కు జింబాబ్వే, అఫ్గానిస్థాన్‌ సిరీస్‌లు కాస్త ఊరటనిచ్చాయి. ఆ తర్వాత ఆసియా క్రీడల్లోనూ భారత జట్టుకు తిరుగులేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఎదురుకానున్న సిరీస్‌ మాత్రం అంత సులభం కాదు. పొట్టి క్రికెట్‌లో ఏ జట్టునైనా ఓడించగల సత్తా ఉన్న వెస్టిండీస్‌పై విజయం సాధించాలంటే శ్రేయస్‌ సేన అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందే.

వివరాలు

లఖ్‌నవూలో తొలి టీ20

వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌.. ఇప్పుడు టీ20 సమరానికి సిద్ధమైంది.

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లఖ్‌నవూలోని ఎకానా స్టేడియంలో మంగళవారం తొలి టీ20 జరగనుంది.

వన్డే సిరీస్‌ను కోల్పోయినప్పటికీ మూడు మ్యాచ్‌ల్లోనూ వెస్టిండీస్‌ బ్యాటర్లు సత్తా చాటారు. టీ20ల్లో కరీబియన్‌ జట్టు బ్యాటింగ్‌ మరింత ప్రమాదకరంగా మారే అవకాశముంది.

భారత్‌తో జరిగిన చివరి వన్డేలో సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడిన షై హోప్‌కు తోడు హెట్‌మయర్, రొమాన్‌ పావెల్, షెర్ఫానీ రూథర్‌ఫర్డ్‌ వంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఆ జట్టులో ఉన్నారు.

వీరంతా పొట్టి క్రికెట్‌కు తగ్గట్లుగా దూకుడుగా ఆడగల సమర్థులు. షై హోప్‌తో కలిసి కామిల్‌ పూరన్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.

వివరాలు

గుడాకేశ్‌ మోటీ ప్రతిభావంతుడైన స్పిన్నరే

రొమారియో షెఫర్డ్, షమార్‌ స్ప్రింగర్‌ రూపంలో బ్యాటింగ్‌తో పాటు పేస్‌ బౌలింగ్‌లోనూ ప్రభావం చూపగల ఆల్‌రౌండర్లు విండీస్‌కు బలం.

అకీల్‌ హొసీన్‌ ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 స్పిన్నర్లలో ఒకడు. గుడాకేశ్‌ మోటీ కూడా ప్రతిభావంతుడైన స్పిన్నరే.

ఈ ఇద్దరూ బ్యాటింగ్‌లోనూ అవసరమైనప్పుడు రాణించగలరు. మాథ్యూ ఫోర్డ్, షమార్‌ జోసెఫ్‌ కొత్త బంతిని పంచుకునే అవకాశముంది.

ADVERTISEMENT

వివరాలు

ఓపెనర్ల విషయంలో మరోసారి సందిగ్ధత

భారత జట్టుకు మరోసారి సెలక్షన్‌ చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ఓపెనింగ్‌ విషయంలో కొంతకాలంగా కొనసాగుతున్న కుర్చీలాట అయోమయానికి దారి తీస్తోంది.

వైభవ్‌ సూర్యవంశీకి అవకాశమిచ్చేందుకు కొన్ని మ్యాచ్‌ల్లో సంజు శాంసన్‌ను పక్కన పెట్టారు. అయితే ఇటీవల ఆసియా క్రీడల్లో మాత్రం ఇద్దరికీ తుది జట్టులో చోటిచ్చి, సంజును మూడో స్థానంలో ఆడించారు.

ఆ క్రీడల్లో భారత జట్టుకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు రెగ్యులర్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ మార్గనిర్దేశంలో భారత్‌ బరిలోకి దిగుతోంది.

గంభీర్‌ సంజు శాంసన్‌ను ఓపెనర్‌గా ఆడించడానికే మొగ్గు చూపుతాడు. లేదంటే అతణ్ని తుది జట్టులోనే పక్కన పెట్టే అవకాశం ఉంది.

దీంతో తొలి టీ20లో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు

మూడో స్థానంలో సంజు ఆడే అవకాశం

ఒకవేళ వైభవ్‌, సంజు ఇద్దరూ జట్టులో ఉంటే.. అభిషేక్‌ శర్మతో కలిసి వైభవ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది. సంజు మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేయవచ్చు.

ఎవరితో ఓపెనింగ్‌ చేయించినా పవర్‌ప్లేలోనే ధాటిగా ఆడి పరుగుల వరద పారించడం భారత్‌కు కీలకం.

బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న వెస్టిండీస్‌ను నిలువరించాలంటే భారీ లక్ష్యాలను నిర్దేశించాల్సిన అవసరం ఉంది.

వివరాలు

భారత బ్యాటింగ్‌కు బలం

భారత్‌కు కూడా భారీ లక్ష్యాలను ఛేదించాల్సిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. అభిషేక్‌ శర్మతో పాటు ఇషాన్‌ కిషన్, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె మంచి ఫామ్‌లో ఉండటం జట్టుకు సానుకూల అంశం.

అయితే కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ నుంచి మాత్రం ఒక భారీ ఇన్నింగ్స్‌ రావాల్సి ఉంది. ఇప్పటివరకు అంచనాలకు తగ్గ స్థాయిలో రాణించలేకపోయిన అతను.. వెస్టిండీస్‌తో సిరీస్‌లోనైనా తన బ్యాట్‌కు పదును పెడతాడేమో చూడాలి.

బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌తో కలిసి కుల్‌దీప్‌ యాదవ్‌ స్పిన్‌ బాధ్యతలను పంచుకునే అవకాశం ఉంది.

ఆసియా క్రీడల్లో అక్షర్‌, వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కుల్‌దీప్‌ మంచి లయతో బౌలింగ్‌ చేశారు. భారత పేస్‌ విభాగం మాత్రం అంత బలంగా కనిపించడం లేదు.

వివరాలు

ఎకానా పిచ్‌.. కొంచెం నెమ్మదిగా

అర్ష్‌దీప్‌ సింగ్‌ మాత్రమే అనుభవజ్ఞుడైన పేసర్‌గా ఉన్నాడు. మయాంక్‌ యాదవ్‌, ప్రిన్స్‌ యాదవ్‌లలో ఒకరు అర్ష్‌దీప్‌తో కలిసి పేస్‌ దాడిని ప్రారంభించే అవకాశం ఉంది.

వైభవ్‌, సంజుల్లో ఒకరినే తుది జట్టులోకి తీసుకుంటే.. తెలుగు కుర్రాడు, పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది

లఖ్‌నవూలోని ఎకానా స్టేడియం పిచ్‌ సాధారణంగా కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ఐపీఎల్‌లోనూ ఇక్కడ భారీ స్కోర్లు ఎక్కువగా నమోదుకావు.

160-170 పరుగుల స్కోర్లను సైతం జట్లు కాపాడుకున్న సందర్భాలున్నాయి. అయితే మంగళవారం జరిగే మ్యాచ్‌కు వికెట్‌ మరీ కఠినంగా ఉండకపోవచ్చు.

అయినప్పటికీ పరుగుల వరద పారే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT