LOADING...
India Vs South Africa: టీ20 పోరు ప్రారంభం.. భారత్-సఫారీ మధ్య పైచేయి ఎవరిదో?
టీ20 పోరు ప్రారంభం.. భారత్-సఫారీ మధ్య పైచేయి ఎవరిదో?

India Vs South Africa: టీ20 పోరు ప్రారంభం.. భారత్-సఫారీ మధ్య పైచేయి ఎవరిదో?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2025
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఆధిపత్యం చూపగా... వన్డే సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఇప్పుడు పోరు టీ20లకు చేరుకోవడంతో, ఈ సిరీస్‌ను గెలిచి భారత్ పర్యటనలో పైచేయి సాధించాలనే ఆతృత సఫారీ జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు వన్డేల్లో సాధించిన విజయాన్ని టీ20ల్లోనూ కొనసాగిస్తూ, టెస్టుల్లో ఎదురైన వైట్‌వాష్‌ చేదు అనుభవానికి గట్టి ప్రతిస్పందన ఇవ్వాలనే నిశ్చయంతో భారత జట్టు మైదానంలోకి దిగబోతోంది. ముఖ్యంగా 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత సునాయాసంగా వరుస సిరీస్‌లు గెలుస్తున్న సూర్యకుమార్‌ యాదవ్ సేన... రాబోయే రెండు నెలల్లో స్వదేశంలో జరగనున్న ప్రపంచకప్‌కు బలమైన సన్నాహాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Details

కటక్‌లో టీ20 పోరుకు రెడీ!

టెస్టుల్లో ఎదురైన పరాభవం తర్వాత వన్డే సిరీస్ విజయం భారత జట్టుకు భారీ ఊరట ఇచ్చింది. కోహ్లి, రోహిత్‌ శర్మల అద్భుత ప్రదర్శన అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఇక టీ20 సిరీస్‌... ఆద్యంతం రసవత్తరంగా సాగడం ఖాయం. గతేడాది దక్షిణాఫ్రికా నేలపై సఫారీలను ఓడించిన సూర్య సేన... అదే ఫలితాన్ని స్వదేశంలో పునరావృతం చేయాలని చూస్తోంది. ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యలు తిరిగి జట్టులోకి రావడం భారత్‌కు పెద్ద అదనపు బలం. అయితే, టెస్టులు-వన్డేల్లో చూపిన పోటీని బట్టి చూస్తే, ఈసారి టీ20ల్లో దక్షిణాఫ్రికా అంత తేలిగ్గా వెనక్కి తగ్గనట్టే ఉంది.

Details

అభిషేక్‌ శర్మపై స్పాట్‌లైట్!

వన్డేల్లో కోహ్లి, రోహిత్‌ల దృష్టిని ఆకర్షించినట్లే... టీ20ల్లో అన్ని కళ్లూ ఇప్పుడు అభిషేక్‌ శర్మపైనే ఉన్నాయి. తొలి బంతి నుంచే దూకుడైన ఆటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే అభిషేక్‌— ఆసియా కప్, ఆస్ట్రేలియా పర్యటన, ముస్తాక్ అಲಿ ట్రోఫీ... ఎక్కడైనా తన దూకుడు బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో కూడా అతని నుండి మెరుపు ఆరంభాలు ఆశిస్తున్న భారత శిబిరం. శుభ్మన్ గిల్ ఈ సిరీస్‌లో పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడా? మెడ గాయం తర్వాత తిరిగి ఫామ్‌లోకి ఎలా వస్తాడన్నది ఆసక్తికరం. ఇదే విధంగా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా రెండు నెలల విరామం తర్వాత మళ్లీ యాక్షన్‌లోకి దిగుతున్నాడు. ముస్తాక్ అలీలో అతడు కూడా మెరుగైన ఫామ్ ప్రదర్శించాడు.

Advertisement

Details

భారత జట్టు కాంబినేషన్ ఇదే?

బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, గిల్, దూబె—ఈ కూర్పు చాలా బలంగా కనిపిస్తోంది. బుమ్రా తిరిగి రావడం జట్టుకు పెద్ద పాజిటివ్. అతనితో పాటు హార్దిక్ కొత్త బంతిని పంచుకుంటాడు. మరో పేసర్‌గా అర్ష్‌దీప్‌కు అవకాశం దక్కుతుందా? లేక దూబె పేస్ ఆప్షన్‌గా ఉపయోగపడతాడా అనేది ఆఖరి నిర్ణయంలో తేలుతుంది. స్పిన్ విభాగంలో అక్షర్, కుల్‌దీప్, వరుణ్ చక్రవర్తి—ఈ ముగ్గురు తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువ.

Advertisement

Details

దక్షిణాఫ్రికా బలం అదే!

టెస్టుల్లో సున్నా చుట్టించినా... వన్డేల్లో భారత జట్టుకు గట్టి సవాల్ విసిరింది దక్షిణాఫ్రికా. ఇప్పుడు టీ20ల్లోనూ ఆ జట్టు పటిష్ఠంగానే కనిపిస్తోంది. కెప్టెన్ మార్‌క్రమ్‌, డికాక్‌ ఇద్దరూ వన్డేల్లో సెంచరీలతో జోరుమీదున్నారు. డివాల్డ్ బ్రెవిస్, యాన్సెన్, కార్బిన్ బోష్‌ల ఆగ్రెసివ్ గేమ్‌ భారత్‌కు ఇప్పటికే తలనొప్పి కలిగించింది. రీజా హెండ్రిక్స్‌, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్‌లు ఉన్న ఈ బ్యాటింగ్ లైనప్... టీ20 ఫార్మాట్‌లో మరింత ప్రమాదకరం. బౌలింగ్‌లో రబాడా గైర్హాజరు సఫారీలకు పెద్ద దెబ్బ. యాన్సెన్, బోష్‌మీదే ప్రధాన భారం పడనుంది. నోకియా, ఎంగిడిల్లో ఒకరు కూడా ప్లేయింగ్ XIలో ఉండే అవకాశముంది. స్పిన్ విభాగంలో జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్ కటక్ పిచ్‌ను కీలకంగా మార్చే ప్రయత్నం చేయనున్నారు.

Details

 పిచ్ & వాతావరణం

బారాబటి పిచ్‌ సమతూకంతో ఉండే ట్రాక్‌—ఆరంభంలో పేసర్లకు, తరువాత స్పిన్నర్లకు సహకారం. మంచు ప్రభావం పెరుగుతుండడం బౌలర్లకు ఇబ్బందికరం. అందుకే టాస్ గెలిచితే బ్యాటింగ్ ఛేదనకే జట్లు మొగ్గు చూపవచ్చు. వర్షం ముప్పు ఏమీ లేదు. 2024టీ20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే... 2026టోర్నీకి సన్నాహాలు ప్రారంభించామని సూర్యకుమార్ యాదవ్ చెప్పారు. ఎక్కువ మార్పులు ఉండవు. అదే కాంబినేషన్‌ కొనసాగిస్తాం. గిల్‌కి ఓపెనింగ్‌ స్థానం అతనిదే. లేకపోతే సంజును ప్రయత్నించాం. హార్దిక్‌ కొత్త బంతితో రావడం జట్టుకు పెద్ద ప్లస్. అతని అనుభవం, ఫిట్‌నెస్‌ మాకు కీలకమని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇప్పుడు నేను చాలా మెరుగైన స్థితిలో ఉన్నా. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చేసిన శిక్షణ నాకు ఎంతో ఉపయోగపడిందని శుభ్‌మాన్‌గిల్ చెప్పారు.

Advertisement