LOADING...
IPL : ఐపీఎల్ అంటే వెంటనే గుర్తుకొచ్చే సంఘటనలివే..
ఐపీఎల్ అంటే వెంటనే గుర్తుకొచ్చే సంఘటనలివే..

IPL : ఐపీఎల్ అంటే వెంటనే గుర్తుకొచ్చే సంఘటనలివే..

వ్రాసిన వారు Moogati Shabari
Mar 26, 2026
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ ఒక పెద్ద బ్రాండ్‌గా నిలిచింది. ఇది కేవలం డబ్బు సంపాదనకే కాకుండా, ఆటపరంగా కూడా విశేష గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా అభిమానులకు మరపురాని అనుభవాలను అందించిన లీగ్ ఇది. సంబరాలే కాదు, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు, వివాదాలు అన్నీ కలిసిన సమాహారమే ఐపీఎల్‌. మరికొన్ని రోజుల్లోనే 19వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ అనగానే గుర్తుకొచ్చే కొన్ని ముఖ్య అంశాలను పరిశీలిద్దాం.

వివరాలు 

స్టార్ల హంగామా మామూలుగా ఉండదు..

ఐపీఎల్ అంటేనే ధోని ఎలా ఆడతాడు? రోహిత్ శర్మ ఈసారి ముంబయికి ఆరో ట్రోఫీ అందిస్తాడా? విరాట్ కోహ్లీ తన ఫామ్ కొనసాగిస్తాడా? వంటి చర్చలు సహజం. మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకు ఆడుతున్న స్టార్ ఆటగాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే. అందులో ముఖ్యంగా ధోని, రోహిత్, కోహ్లీ పేర్లు ముందుంటాయి. ఎంతో మంది కొత్త ఆటగాళ్లు వచ్చినా, వెళ్లినా ఈ ముగ్గురు కలిగించే ఉత్సాహం మాత్రం ప్రత్యేకమే.

వివరాలు 

ఉత్కంఠ క్షణాల గురించే చర్చ..

టీ20ల్లో స్కోర్లు సమం అయితే విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ పద్ధతిని ఉపయోగిస్తారని తెలిసిందే. ఐపీఎల్‌లో కూడా ఇప్పటివరకు 15 సార్లు సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలింది. ప్రత్యేకంగా 2020 సీజన్ ఎంతో గుర్తుండిపోయింది. ఆ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించబడ్డాయి. ముఖ్యంగా ముంబయి, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు అపారమైన ఉత్కంఠను అందించింది. 202 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ముంబయి 201 పరుగులకే పరిమితమవడంతో సూపర్ ఓవర్ అవసరమైంది. ఆ సూపర్ ఓవర్‌లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. చివరి బంతి వరకు సాగిన ఆ పోరు ఎంత రసవత్తరంగా సాగిందో చెప్పనక్కర్లేదు.

Advertisement

వివరాలు 

ఐపీఎల్‌లో జరిగిన వివాదాలు, శిక్షలు ఇవే..

దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ లీగ్‌లో వివాదాలు కూడా తక్కువగా లేవు. శ్రీశాంత్‌పై హర్భజన్ చేయి చేసుకున్న సంఘటన అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. తర్వాత ఇద్దరూ సర్దుకున్నప్పటికీ, ఆ ఘటన మాత్రం ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయింది. 2013లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ కారణంగా నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అలాగే 2016, 2017 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై రెండేళ్ల నిషేధం విధించారు. 2012లో ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఆర్సీబీ ఆటగాడు లూక్ పోమెర్‌బాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని షారుక్ ఖాన్‌పై వాంఖడే స్టేడియంలో జరిగిన వివాదం కారణంగా ఐదేళ్ల నిషేధం విధించారు. అప్పట్లో అది సినిమా ప్రచారం కోసమేనని కూడా వార్తలు వచ్చాయి.

Advertisement

వివరాలు 

ధోని ఆగ్రహం మర్చిపోలేరు..

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ధోని ఒకసారి మాత్రం కోపాన్ని ప్రదర్శించాడు. 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ మొదట నో-బాల్‌గా ప్రకటించి, వెంటనే ఆ నిర్ణయాన్ని మార్చాడు. దీంతో అసహనం చెందిన ధోని డ్రెస్సింగ్ రూమ్ నుంచి నేరుగా మైదానంలోకి వచ్చి అంపైర్లతో వాదించాడు. ఈ ఘటనకు అతనిపై 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించారు. తన కెరీర్‌లో ఇదే పెద్ద తప్పు అని ధోని తర్వాత పలుమార్లు పేర్కొన్నాడు. అభిమానులకు ఇది అతనిలోని విభిన్న కోణాన్ని చూపించింది.

వివరాలు 

వాగ్వాదాలు కూడా జరిగాయిలా..

ఐపీఎల్ చరిత్రలో మరో ప్రముఖ వివాదం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగింది. 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. గంభీర్ అప్పట్లో ఎల్‌ఎస్‌జీకి మెంటార్‌గా ఉన్నాడు. మ్యాచ్ సమయంలో కేల్ మయేర్స్‌తో కోహ్లీ మాట్లాడుతుండగా గంభీర్ జోక్యం చేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరి ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది. చివరకు ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకుని వారిని విడదీయడంతో పరిస్థితి చల్లబడింది.

Advertisement