LOADING...
Richest Female Cricketers: ఆటతో దేశాన్ని గెలిపించి.. సంపదతో రికార్డు సృష్టించిన టీమిండియా మహిళా క్రికెటర్స్ వీరే! 
ఆటతో దేశాన్ని గెలిపించి.. సంపదతో రికార్డు సృష్టించిన టీమిండియా మహిళా క్రికెటర్స్ వీరే!

Richest Female Cricketers: ఆటతో దేశాన్ని గెలిపించి.. సంపదతో రికార్డు సృష్టించిన టీమిండియా మహిళా క్రికెటర్స్ వీరే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 04, 2025
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

నవీ ముంబై వేదికగా నవంబర్‌ 2న జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలో టీమిండియా సాధించిన ఈ విజయం కేవలం క్రీడా ఘనత మాత్రమే కాదు.. సంవత్సరాల తరబడి చేసిన కృషి, క్రమశిక్షణ, పట్టుదల, ఆశల సమ్మేళనంగా నిలిచింది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. మహిళా క్రికెట్‌ భారత క్రీడా ప్రపంచంలో కొత్త దిశను సృష్టించగా, ఈ విజయం క్రీడాకారిణుల ఖ్యాతిని పెంచడమే కాకుండా, వారి ఆర్థిక స్థాయిలోనూ గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. ఇప్పుడు దేశంలో అత్యధిక సంపన్న మహిళా క్రికెటర్లు ఎవరో చూద్దాం.

Details

అత్యంత సంపన్నురాలు మిథాలీ రాజ్

భారత మహిళా క్రికెట్‌ చరిత్రలోనే గొప్ప కెప్టెన్‌గా పేరుపొందిన మిథాలీ రాజ్‌ (Mithali Raj) ప్రస్తుతం అత్యంత సంపన్నురాలు. ఆమె నికర ఆస్తులు సుమారు రూ.40 నుంచి రూ.45 కోట్ల మధ్యగా అంచనా. 1982 డిసెంబర్‌ 3న జోధ్‌పూర్‌లో జన్మించిన మిథాలీ, చిన్న వయసులోనే క్రికెట్‌లో అడుగుపెట్టారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఆమె అగ్రస్థానంలో ఉన్నారు. రిటైర్మెంట్‌ తర్వాత కూడా బ్రాండ్‌ ప్రమోషన్లు, మెంటర్‌షిప్‌, క్రికెట్‌ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆదాయం పొందుతున్నారు.

Details

స్మృతి మంధాన - ప్రతిభతో పాటు వ్యాపార దృష్టి 

మిథాలీ తర్వాత స్థానంలో స్మృతి మంధాన (Smriti Mandhana) ఉన్నారు. ఆమె నికర విలువ రూ.32 నుంచి రూ.34 కోట్ల మధ్యగా ఉంది. బీసీసీఐ గ్రేడ్‌ A కాంట్రాక్ట్‌ కింద ప్రతి సంవత్సరం రూ.50 లక్షలు పొందుతుండగా, మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌గా రూ.3.4 కోట్లు సంపాదిస్తున్నారు. హ్యుందాయ్‌, నైక్‌, రెడ్‌బుల్‌ వంటి బ్రాండ్‌లకు ఆమె అంబాసడర్‌. అదనంగా SM-18 స్పోర్ట్స్‌ కేఫ్‌, జిమ్‌, ప్రైవేట్‌ థియేటర్‌లను కూడా నిర్వహిస్తున్నారు.

Advertisement

Details

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ - వరల్డ్‌కప్‌తో పెరిగిన బ్రాండ్‌ విలువ

ప్రపంచకప్‌ విజేత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (Harmanpreet Kaur) నికర ఆస్తులు సుమారు రూ.25 కోట్లుగా అంచనా. ఆమెకు బీసీసీఐ గ్రేడ్‌ A కాంట్రాక్ట్‌ ద్వారా రూ.50 లక్షలు లభిస్తాయి. మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ప్రతి సీజన్‌కు రూ.1.8 కోట్లు పొందుతున్నారు. పంజాబ్‌ పోలీస్‌లో DSPగా సేవలందిస్తున్న ఆమె, పుమా, CEAT, HDFC లైఫ్‌, బూస్ట్‌ వంటి బ్రాండ్‌లతో ఒప్పందాలు కలిగి ఉన్నారు. ఈ ఎండార్స్‌మెంట్ల ద్వారానే ఆమె సంవత్సరానికి రూ.50 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. పాటియాలా, ముంబయిలో నివాసాలు, లగ్జరీ కార్లు, బైక్‌ల సేకరణ కూడా ఆమె ఆస్తుల్లో భాగం.

Advertisement

Details

సమగ్రంగా చూస్తే

మిథాలీ, స్మృతి, హర్మన్‌ప్రీత్‌ల విజయాలు భారత మహిళా క్రికెట్‌కు కొత్త గుర్తింపు తెచ్చాయి. వీరి విజయాలు కేవలం మైదానంలో మాత్రమే కాకుండా, వారి జీవనశైలిని, ఆర్థిక స్థాయిని కూడా శక్తివంతం చేశాయి. ప్రపంచకప్‌ విజయం తర్వాత ఈ ముగ్గురు భారత మహిళా క్రికెట్‌ ప్రతీకలుగా నిలుస్తున్నారు.

Advertisement