IND vs NZ 3rd ODI: టాస్ పడకుండానే భారత్-న్యూజిలాండ్ మూడో వన్డే రద్దయ్యే ఛాన్స్.. హామిల్టన్‌లో భారీ వర్షం!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ కీలక దశకు చేరుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన టీమిండియా 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పుడు మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. నవంబర్ 10న హామిల్టన్‌లోని సెడన్ పార్క్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ కీలక పోరుకు వర్షం అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది.
వివరాలు
మ్యాచ్‌కు వరుణుడి ముప్పు!
హామిల్టన్‌లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. నవంబర్ 9న భారత ఆటగాళ్లకు పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా లభించలేదు.
దీంతో పలువురు బ్యాటర్లు ఇండోర్ ప్రాక్టీస్‌కే పరిమితమయ్యారు. మ్యాచ్ రోజు కూడా ఇదే తరహా వాతావరణం కొనసాగవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.
రోజంతా వర్షాలు కురిసే అవకాశం!
AccuWeather నివేదిక ప్రకారం.. నవంబర్ 10న హామిల్టన్‌లో అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రోజంతా సుమారు 20-45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా.
గరిష్ఠ ఉష్ణోగ్రత 16-19 డిగ్రీల సెల్సియస్ మధ్య, కనిష్ఠ ఉష్ణోగ్రత 15-16 డిగ్రీల మధ్య ఉండవచ్చని సమాచారం.
ఆకాశం మేఘావృతమై ఉండటంతో మ్యాచ్ నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
వివరాలు
తొలి రెండు వన్డేలకూ వర్షం అంతరాయం!
ఈ సిరీస్‌లో ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ వర్షం ప్రభావం చూపించింది. తొలి వన్డేలో న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం భారత ఇన్నింగ్స్ సమయంలో వర్షం రావడంతో డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలో 34 ఓవర్లకు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
భారత్ 22.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
రెండో వన్డేలోనూ వరుణుడు పలుమార్లు ఆటకు అంతరాయం కలిగించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 41 ఓవర్లలో 134పరుగులకే కుప్పకూలింది.
అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 26 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మరోసారి ఆటను నిలిపివేసింది.
వివరాలు
మూడో వన్డే అయినా పూర్తవుతుందా?
వరుసగా రెండు విజయాలతో జోష్ మీదున్న టీమిండియా మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది.
అయితే హామిల్టన్ వాతావరణం భారత జట్టు ఆశలకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
వర్షం ఎంతసేపు కొనసాగుతుంది? మైదానం పరిస్థితులు ఎలా ఉంటాయి? అనే అంశాలపైనే మ్యాచ్ నిర్వహణ ఆధారపడి ఉంటుంది.
వర్షం ముప్పు ఉన్నప్పటికీ మ్యాచ్ రద్దవడం ఖాయమని ఇప్పుడే చెప్పలేం.