LOADING...
Tennis Players: ప్రైజ్ మనీ వివాదం.. రోలాండ్ గారోస్‌కు షాక్ ఇవ్వనున్న స్టార్ ప్లేయర్లు
ప్రైజ్ మనీ వివాదం.. రోలాండ్ గారోస్‌కు షాక్ ఇవ్వనున్న స్టార్ ప్లేయర్లు

Tennis Players: ప్రైజ్ మనీ వివాదం.. రోలాండ్ గారోస్‌కు షాక్ ఇవ్వనున్న స్టార్ ప్లేయర్లు

వ్రాసిన వారు Moogati Shabari
May 06, 2026
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ టెన్నిస్‌లో టాప్ ప్లేయర్లు ఫ్రెంచ్ ఓపెన్‌ను బహిష్కరించే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆర్యనా సబలెంకా, కోకో గాఫ్ వంటి ప్రముఖ ఆటగాళ్లు తమకు కావాల్సిన ప్రైజ్ మనీ పెంపు జరగకపోతే రోలాండ్ గారోస్‌ను బహిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం ప్లేయర్లు, ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకుల మధ్య ప్రైజ్ మనీ పంపిణీపై వివాదం కొనసాగుతోంది. ఈ ఏడాది టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీని 9.5 శాతం పెంచి €61.7 మిలియన్‌కు చేర్చినప్పటికీ, ఇతర గ్రాండ్ స్లామ్‌లతో పోలిస్తే ఇది తక్కువేనని ఆటగాళ్లు భావిస్తున్నారు.

వివరాలు

చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం..

టోర్నమెంట్ మొత్తం ఆదాయంలో తమకు వచ్చే ప్రైజ్ మనీ 15 శాతం కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అయితే ATP, WTA కలిపిన 1000 ఈవెంట్స్‌ల మాదిరిగా 22 శాతం ఇవ్వాలని ప్లేయర్లు డిమాండ్ చేస్తున్నారు. 2026 ఇటాలియన్ ఓపెన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సబలెంకా, "ఏదో ఒక దశలో మేము ఈ టోర్నమెంట్‌ను బహిష్కరించే పరిస్థితి వస్తుంది. మా హక్కుల కోసం పోరాడటానికి అది ఒక్కటే మార్గంగా మారవచ్చు" అని వ్యాఖ్యానించారు. అయితే బహిష్కరణ హెచ్చరికలు ఉన్నప్పటికీ, చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సబలెంకా ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాలు

ప్రైజ్ మనీపై చర్చలు..

"ప్రస్తుతం జరుగుతున్న చర్చలు చివరికి అందరికీ అనుకూలమైన నిర్ణయానికి దారి తీస్తాయని ఆశిస్తున్నాను" అని ఆమె తెలిపారు. మరోవైపు కోకో గాఫ్ కూడా ప్లేయర్లు ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆమె చెప్పినట్లుగా, బాస్కెట్‌ బాల్‌లోని WNBA తరహాలో యూనియన్ ఏర్పాటైతే ప్లేయర్లకు మరింత బలం వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక ప్రైజ్ మనీ విషయంలో రోలాండ్ గారోస్ ఇతర గ్రాండ్ స్లామ్‌ల కంటే వెనుకబడే పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది యూఎస్ ఓపెన్ 90 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ ఇవ్వగా, విమ్బుల్డన్ 72.51 మిలియన్ డార్లు అందించింది. 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ అయితే 80.06 మిలియన్‌ డాలర్లతో రికార్డు సృష్టించింది.

Advertisement

వివరాలు

ప్రైజ్ మనీ పెంచాలని డిమాండ్..

ప్రైజ్ మనీ అంశంతో పాటు ప్లేయర్లతో సరైన సంప్రదింపులు జరపకపోవడం కూడా వివాదానికి దారితీసింది. నోవాక్ జొకోవిచ్, జానిక్ సిన్నర్ వంటి టాప్ ఆటగాళ్లు గత ఏడాది నుంచి నాలుగు గ్రాండ్ స్లామ్‌ల నిర్వాహకులతో విభేదాలు వ్యక్తం చేస్తున్నారు. తమపై నేరుగా ప్రభావం చూపే నిర్ణయాల్లో ఎక్కువ పాత్ర ఇవ్వాలని, ప్రైజ్ మనీ పెంచాలని వారు సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు.

Advertisement