Loading...
Shreyas Iyer: న్యూజిలాండ్‌తో రెండు వన్డేలు.. కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌?
న్యూజిలాండ్‌తో రెండు వన్డేలు.. కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌?

Shreyas Iyer: న్యూజిలాండ్‌తో రెండు వన్డేలు.. కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2026
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్‌ పర్యటనలో టీ20 కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముంది. రెండు వన్డే మ్యాచ్‌ల్లో ఆయన భారత జట్టుకు నాయకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భారత్, న్యూజిలాండ్‌ జట్లు ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్నాయి. ఈ నెల 22 నుంచి నవంబరు 1 వరకు టీ20 సిరీస్‌ జరగనుండగా.. నవంబరు 4 నుంచి 15 వరకు వన్డే సిరీస్‌ కొనసాగుతుంది. నవంబరు 19న తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌(WTC)లో ఈ సిరీస్‌ భారత్‌కు కీలకం కానుంది. సిరీస్‌ సన్నాహాల్లో భాగంగా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ చివరి రెండు వన్డేలకు దూరంగా ఉండే అవకాశముంది.

వివరాలు

ఆకాశ్‌దీప్‌ టెస్టు సిరీస్ కు ఎంపికయ్యే అవకాశం

వరుసగా ఐదు వన్డేలు ఆడిన తర్వాత కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగాల్సి రావడం ఇబ్బందికరంగా మారుతుందన్న ఉద్దేశంతో గిల్‌ చివరి రెండు వన్డేలు ఆడకపోవచ్చని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆ రెండు వన్డేల్లో టీ20 కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ భారత జట్టును నడిపించే అవకాశాలున్నాయి.

ఇప్పటికే టీ20ల్లో జట్టుకు నాయకత్వం వహిస్తున్న అయ్యర్‌కు వన్డేల్లోనూ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు గాయంతో చాలాకాలంగా మైదానానికి దూరంగా ఉన్న ఫాస్ట్‌బౌలర్‌ ఆకాశ్‌దీప్‌ కూడా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలున్నాయి.

గాయం నుంచి కోలుకున్న ఆకాశ్‌దీప్‌ను టెస్టు జట్టులోకి తీసుకునే అంశాన్ని సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

వివరాలు

తాత్కాలిక చీఫ్‌ సెలక్టర్‌గా ప్రజ్ఞాన్‌ ఓజా

న్యూజిలాండ్‌ పర్యటన కోసం భారత జట్టును సెలక్టర్లు మంగళవారం లేదా బుధవారం ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే సెలక్షన్‌ కమిటీకి తాజాగా కీలక మార్పు చోటుచేసుకుంది. గత మూడేళ్లుగా సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగిన అజిత్‌ అగార్కర్‌ ఇటీవలే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

దీంతో సెలక్షన్‌ కమిటీ సభ్యుల్లో ఒకరైన మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా కొంతకాలం తాత్కాలిక చీఫ్‌ సెలక్టర్‌గా వ్యవహరించనున్నాడు.

ఆయన నేతృత్వంలోనే న్యూజిలాండ్‌ పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసేందుకు సెలక్షన్‌ కమిటీ సమావేశం జరగనుంది.

ADVERTISEMENT