Loading...
Suryakumar Yadav: సూర్యకుమార్‌ యాదవ్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. రంజీ జట్టులో నో ప్లేస్‌!
సూర్యకుమార్‌ యాదవ్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. రంజీ జట్టులో నో ప్లేస్‌!

Suryakumar Yadav: సూర్యకుమార్‌ యాదవ్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. రంజీ జట్టులో నో ప్లేస్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2026
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియాకు వరుసగా దూరమవుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌ కోసం ప్రకటించిన ముంబయి జట్టులో అతడికి చోటు దక్కలేదు. అక్టోబర్‌ 11న చండీగఢ్‌తో జరిగే మ్యాచ్‌కు సూర్యకుమార్‌ అందుబాటులో ఉన్నప్పటికీ.. సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టారు. అంతేకాదు.. 19 ఏళ్ల యువ బ్యాటర్‌ ఆయుష్‌ మాత్రేను జట్టు వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. భారత అండర్‌-19 జట్టుకు ప్రపంచకప్‌ అందించిన అనుభవం ఉన్న మాత్రేను భవిష్యత్‌ కెప్టెన్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే మాత్రే ఇప్పటివరకు 13 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

వివరాలు

18 నెలలుగా రెడ్‌ బాల్‌ క్రికెట్‌కు దూరం

సూర్యకుమార్‌ యాదవ్‌ గత 18 నెలలుగా ఒక్క రెడ్‌ బాల్‌ మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఈ నేపథ్యంలో ముందుగా కొన్ని మ్యాచ్‌లు ఆడి ఫామ్‌లోకి రావాలని అతడికి సూచించినట్లు ముంబయి సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ రమేశ్‌ పవార్‌ తెలిపారు.

రంజీ మ్యాచ్‌లకు తాను అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ సూర్యకుమార్‌ సెలక్షన్‌ కమిటీకి సందేశం పంపినప్పటికీ.. అతడిని జట్టులోకి తీసుకోలేదు.

ఇక ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లోనూ సూర్యకుమార్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడిని ఈ ఏడాది టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించారు.

అతడి స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.

వివరాలు

ముంబయి జట్టులో యశస్వి జైస్వాల్

మరోవైపు భారత యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ముంబయి జట్టులో చోటు దక్కించుకున్నాడు. 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు సిద్ధేశ్‌ లాడ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

న్యూజిలాండ్‌తో నవంబర్‌లో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు యశస్వి జైస్వాల్‌కు ఈ రంజీ మ్యాచ్‌ ఉపయోగపడే అవకాశం ఉంది.

అయితే ముంబయి జట్టుకు శార్దూల్‌ ఠాకూర్‌ అందుబాటులో ఉండడు. శిక్షణ సమయంలో కుడి చేతి మధ్యవేలికి ఫ్రాక్చర్‌ కావడంతో అతడు కనీసం తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.

మరోవైపు గాయం నుంచి కోలుకున్న ఆయుష్‌ మాత్రే, సిద్ధేశ్‌ లాడ్‌ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు.

ADVERTISEMENT

వివరాలు

ముంబయి జట్టు

సిద్ధేశ్‌ లాడ్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, ఆయుష్‌ మాత్రే (వైస్‌ కెప్టెన్‌), దివ్యాంశ్‌ సక్సేనా, ముషీర్‌ ఖాన్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, సువేద్‌ పార్కర్‌, ఆకాశ్‌ ఆనంద్‌ (వికెట్‌ కీపర్‌)

హార్దిక్‌ తమోర్‌ (వికెట్‌ కీపర్‌), శమ్స్‌ ములానీ, తనుష్‌ కొటియన్‌, అథర్వ అంకోలేకర్‌, తుషార్‌ దేశ్‌పాండే, మోహిత్‌ అవస్థి, సిల్వెస్టర్‌ డిసౌజా, ఓంకార్‌ టర్మలే.

ADVERTISEMENT